జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్లో ముసలం..

by Sumithra |
జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్లో ముసలం..
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్లో ముసలం చెలరేగింది. మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ మున్సిపాలిటీలోని తమ వార్డులో ఎలాంటి పనులు నిర్వహించకుండానే ఎజెండాలో పనులు నిర్వహించినట్లు, పొందుపరిచి లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను దారి మళ్ళించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా తమకు తెలియకుండా చేయని పనులను ఎజెండాలో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నిస్తూ శనివారం తలపెట్టిన మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కౌన్సిలర్లు మూకుమ్మడిగా బహిష్కరించి నిరసన తెలిపారు.

జడ్చర్ల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గత కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అభివృద్ధి లేక నిత్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు కూడా కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రవీందర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీంతో పట్టణంలోని ఆయా కాలనీలలో అభివృద్ధి రోజురోజుకు కుంటు పడుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కానీ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రవీందర్ సొంత ఎజెండా తయారు చేసుకుని మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కొరకు 45 లక్షల రూపాయలు వెచ్చించినట్లు అజెండాలో చూపించారని అన్నారు. కానీ ఆ పనులు ఎక్కడ జరిగాయో చెప్పడం లేదని, ఇలా చేయని పనులకు లెక్కల్లో మాత్రం అవసరాలకు మించి లక్షల రూపాయల మేర డబ్బులు వెచ్చించినట్లు చైర్ పర్సన్ లెక్కలు చూపుతున్నారని అన్నారు.

అందుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డ కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని బహిష్కరించి, చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపుతున్నారని, దీంతో నిధులు ఎక్కడ దారి మళ్ళాయి అంటూ కౌన్సిలర్లు ఎజెండాకు సంబంధించిన పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ లక్ష్మీ పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని గ్రహించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుంచి తమ వాహనంలో జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్ పర్సన్ పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి అవిశ్వాస తీర్మానాన్ని పత్రాన్ని అందజేశారు.

Next Story

Most Viewed