సంక్షేమ పథకాలు శాశ్వతంగా నిలిచిపోవాలి

by Sridhar Babu |
సంక్షేమ పథకాలు శాశ్వతంగా నిలిచిపోవాలి
X

దిశ, చేర్యాల : ప్రభుత్వం ఎదైనా ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచి పోవాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల పరిధిలోని లబ్ధిదారులకు 242 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయని, వాటిని నేటి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా కోలుకోవడానికి సమయం పడుతుందని, అందుకే సంక్షేమ పథకాలు కాస్త ఆలస్యమవుతున్నాయని చెప్పారు. కాగా చేర్యాల ప్రాంతంపై మంత్రి ప్రత్యేక దృష్టిసారించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేర్యాలకు మంజూరైన కోర్టును త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, శభాష్ గూడెం వరకు ఉన్న సింగిల్ లైన్ రోడ్డును విస్తరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదకొట్టారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కలుగజేసుకొని సర్ది చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.

Advertisement

Next Story

Most Viewed