సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Kalyani |
సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార సంఘాల ద్వారా 208 మంది రైతులకు రూ.2.30 కోట్ల విలువైన వివిధ రకాల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాల ద్వారా ఆహారశుద్ది పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతుల సమష్టి పెట్టుబడితో కష్టపెడితే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్నారు.

సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులు పాలమూరులో వేరుశెనగ, కంది, పప్పుశెనగ పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వరి కొనుగోళ్లు, వ్యవసాయ యాంత్రీకరణ వ్యాపారంపై సహకార సంఘాలు దృష్టిసారించాలన్నారు. మహారాష్ట్రలో సహకార సంఘాల రైతుల సారథ్యంలోని ఒక్కొక్క పరిశ్రమ విలువ రూ.300 కోట్ల నుంచి రూ.1500 కోట్ల విలువ చేసే పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సహకార సంఘం బ్యాంక్ మేనేజర్ శ్వేత, కార్యదర్శి గోపాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story