Narayanapet : నారాయణపేటకు ప్రత్యేక నిధులేవి...!

by Sumithra |
Narayanapet : నారాయణపేటకు ప్రత్యేక నిధులేవి...!
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం నుంచి బీజేపీకి అధిక మెజార్టీ రావడంతో అభివృద్ధి పై నుంచి నిధులు రావడం లేదని నారాయణపేట నియోజకవర్గం పరిధిలో ప్రజల నుంచి టాక్ బాగా వినిపిస్తుంది. మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు పూర్తయి ఎలక్షన్ కోడ్ ఎత్తివేయగానే సంగం బండ బాధితులకు నిధులు మంజూరయ్యాయి. అలాగే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి( కడా)కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి అంశం పై గత, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఇప్పటికే సుమారు మూడుసార్లు రివ్యూ మీటింగ్లు నిర్వహించి చర్చించారు. కానీ నారాయణపేట నియోజకవర్గం పరిధిలో మాత్రం ఇప్పటివరకు (ప్రత్యేక) నిధులు మంజూరు కాలేదు. అన్ని నియోజకవర్గాల మాదిరిగానే లబ్ధి చేకూరే పథకాలు మాత్రమే లబ్ధిదారులకు అందుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. దీన్ని పరిశీలిస్తే నారాయణపేట నియోజకవర్గం పై ఉద్దేశపూర్వకంగానే పై నుంచి నిధులు మంజూరు చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించి 69 జీవో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్ అంశాలకు సంబంధించి పేపర్ వర్క్ మాత్రమే కొనసాగుతుంది.

కొత్త మండలాలు ఏర్పాటు కాలే.. ప్రత్యేక నిధులు రాలే!

నారాయణపేట నియోజకవర్గంలో నూతన మండలాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది పక్కన పెడితే నారాయణపేట జిల్లా ఏర్పాటు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు జిల్లా పోలీస్ కార్యాలయ ఏర్పాటు కాలేదు.. నియోజకవర్గ పరిధిలో ఆర్టీవో, బాల రక్షాభవన్, రిజిస్ట్రేషన్ కార్యాలయం, కలెక్టరేట్, మైనింగ్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

లీజు స్థలంలోనే ఆర్టీవో కార్యాలయం...

నారాయణపేట జిల్లా కేంద్రానికి దూరంగా ఆర్టీవో కార్యాలయం అరకొర వసతుల మధ్య కొనసాగుతుంది. అప్పట్లో స్థలయజమాని ఆర్టీవో కార్యాలయానికి షెడ్డు ఇతర నిర్మాణ ఏర్పాట్లు చేసి ఇచ్చారు. మిగిలిన స్థలంలో ఆర్టీవో ఏజెంట్లకు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు మాట్లాడుకుని వేలల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఆర్టీవో కార్యాలయానికి ఏర్పాటుకు స్థల ప్రోసీడింగ్ రెవెన్యూ అధికారులు అప్పగించినా.. ఓ మాజీ మంత్రి సన్నిహితుడు తన పలుకుబడితో ఆర్టిఓ కార్యాలయాన్ని ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండేలా తన ప్రయత్నాలు చేస్తున్నారు.

టెక్స్ టైల్ పార్క్.. ఇండస్ట్రియల్ ఫుడ్ పార్క్ ఏర్పాటయ్యేనా?

గత అసెంబ్లీ సమావేశాల్లో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి వెనకబడ్డ నారాయణపేటలో చేనేత రంగ అభివృద్ధి కోసం టెక్స్ టైల్ పార్క్.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. అలాగే నారాయణపేట జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతను తీర్చి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని, మినీ స్టేడియం మైదానం విషయం పై అసెంబ్లీలో విన్నవించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రస్తావించిన అంశాలతో పాటు నారాయణపేట నియోజకవర్గం ప్రత్యేక నిధులు కేటాయిస్తే అభివృద్ధి తొందరగా సాధ్యమవుతుంది.

Advertisement

Next Story

Most Viewed