ఆ ఊరిలో ఇండ్లకు రైతుబంధు.. మామూళ్ల మత్తులో యంత్రాంగం

by Disha News Web Desk |

దిశ, అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కొంకనివాని పల్లె గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. పట్టదారులు ఎలాంటి లే అవుట్ తయారు చేయకుండా ఇంటి నిర్మాణాలకు స్థలాలను గుంటల్లో విక్రయిస్తూ.. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. 1989లో పట్టదారులు ఇండ్ల నిర్మాణాల కోసం వ్యవసాయ భూములను విక్రయించారు. అయినా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ వ్యవసాయ భూమిని తొలగించలేదు. పట్టదారులకు రైతుబంధు అమలవుతూనే వస్తున్నది. ప్రస్తుతం అదే 98 సర్వే నెంబర్‌లో మిగులు భూమిని, ఇంటి నిర్మాణాల కోసం కొనుగోలు వ్యవసాయ భూమిని, స్థానిక తహసీల్దార్ గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. కొంతమంది ముందే ఇంటిని నిర్మించుకుని, వ్యవసాయ భూమిగా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గత నెలలలో పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా పొందారు. ఇండ్ల మధ్య గుంటల్లో ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా తహసీల్దార్ ధరణి రికార్డుల్లో పొందుపరచడం పలు విమర్శలకు తావిస్తోంది. కంచె చేను మేసినట్లు అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అమరచింత మండలంలో ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసిన భూములకు కూడా పట్టదారుల ఖాతాలో రైతుబంధు జమ అవుతున్నది. ఉన్నతాధికారులు దృష్టి సారించి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed