24 గంటల్లో చోరీ సొత్తు రికవరీ.. పోలీసులను అభినందించిన ఎస్పీ

by Kalyani |
24 గంటల్లో చోరీ సొత్తు రికవరీ.. పోలీసులను అభినందించిన ఎస్పీ
X

దిశ, వనపర్తి: 24 గంటల్లో కిడ్నాప్ అండ్ చోరీ కేసును ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులను వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి అభినందించారు. ఈ సందర్భంగా వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి, ఇంచార్జి సీఐ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి,రాము, కానిస్టేబుళ్లు నరేష్, అశోక్, నాగరాజు నిరంజన్ లకు నగదు పురస్కారం అందజేశారు. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మంగళవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో పెద్దమందడి మండల పరిధి జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన గాడుదల బాలయ్యను గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తన మోటార్ వాహనంతో పాటు వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్ లను దొంగలించారు. అనంతరం బాలయ్యను కిడ్నాపర్లు వదిలిపెట్టారు. తరువాత బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి, వనపర్తి ఇంచార్జి సీఐ శ్రీనివాస్ రెడ్డి ల ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ లు యుగంధర్ రెడ్డి, రాములు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు.

బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని చల్మారెడ్డి ఆసుపత్రి సమీపంలో దినసరి కార్మికుల అడ్డా ప్రాంగణంలో పోలీసులు వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట, గణేష్ నగర్ సంత బజార్ లో నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన రాయగిరి నరేష్, వనపర్తి మండలం కడుకుంట గ్రామానికి చెందిన ఆదెం మహేష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా సదరు ఇద్దరు వ్యక్తులు నేరం చేశామని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ. 5000 ల నగదు, రూ. 18,400 విలువగల వెండి ఆభరణాలు, ఒక మొబైల్, హీరో హోండా బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గణేష్, మహేష్ లపై గతంలో ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ లోని మూడు కేసులలో కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed