Collector : ఇకనుంచి మండల స్థాయిలో ప్రజావాణి

by Kalyani |
Collector : ఇకనుంచి మండల స్థాయిలో ప్రజావాణి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా, మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ… ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడంలో భాగంగా మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కరించడం వల్ల లబ్ధిదారులకు వెంటనే ప్రయోజనం కలుగుతుందని, అందువల్ల మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్ట పరచనున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లా స్థాయిలో మాదిరిగానే ప్రతి సోమవారం ఉదయం 10-30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని,ఈ కార్యక్రమానికి మండల స్థాయిలోని అధికారులు,గ్రామపంచాయతీ కార్యదర్శులు సైతం హాజరుకావాలని ఆమె ఆదేశించారు.

ప్రజావాణికి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని,హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని, పరిష్కారం కానివి స్పష్టంగా ఫిర్యాదుదారికి తెలియజేయాలని,లేదా జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే వాటిని జిల్లా స్థాయికి పంపించాలని ఆమె తెలిపారు. మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే,15 రోజుల తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి రావాలని ఆమె సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల అన్నింటికీ వారం రోజుల్లోపు పరిష్కారం చేయాలని, పరిష్కరించిన ఫిర్యాదులను ఆన్ లైన్ లో సైతం ఏర్పాటు చేసి, ప్రతి ఫిర్యాదుకు ఒక ఐడి నెంబర్ ఇవ్వాలని అన్నారు. ప్రజావాణి అనంతరం అదే రోజు సాయంత్రం సమ్మిళిత సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు సైతం మండల స్థాయి ప్రజావాణి పై దృష్టి సారించాలని, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల పరిష్కారం నిమిత్తం మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యుల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించాలని, ఇప్పటివరకు స్వీకరించిన వాటిపై తీసుకున్న చర్యలపై నివేదికల సమర్పించాలని ఆమె ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed