సీఎంఆర్ గోల్ మాల్.. అక్రమాలకు అడ్డాగా రైస్ మిల్లులు

by srinivas |
సీఎంఆర్ గోల్ మాల్.. అక్రమాలకు అడ్డాగా రైస్ మిల్లులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులలో ఎక్కువ శాతం మిల్లులు అక్రమాలకు అడ్డగా మారాయి. పరిస్థితులను మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డంగా సంపాదిస్తున్నారు. సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నా గత సంవత్సరం నరకాలంగా మిల్లర్లు కాలయాపన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022 యాసంగి నుంచి 2024 వానకాలం వరకు మొత్తం 12 లక్షల 48 వేల 756 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, బియ్యం చేయడానికి మిల్లులకు పంపింది. కానీ జూన్ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 1,65,791 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రం ఎఫ్సీఐకి స్వాధీనపరిచారు. ఇంకా 6,73,333 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద నుంచి ఎఫ్ సీఐకి రావాల్సి ఉన్నది. ఇంత పెద్ద మొత్తంలో సీఎంఆర్ ను స్వాధీనం చేయాలి అని అధికారులు మల్ల గుల్లాలు పడుతుంటే.. మిల్లర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

జిల్లాల వారీగా వివరాలు

2022 యాసంగి పంట నుంచి 2024 వానకాలం వరకూ వనపర్తి జిల్లాలో మొత్తం 52.1354 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లర్లకు ఇవ్వగా, ఇప్పటివరకూ 39904 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి ఇవ్వగా, 310547 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల ఆధీనంలోనే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 1,68,011 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 37,169 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి స్వాధీనపరిచినా మిల్లర్ల వద్ద నుంచి, ఇంకా 74 వేల 789 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు లక్షల 31,993 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 51,362 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి స్వాధీనపరిచారు. ఈ జిల్లాలో 1,04,821 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉన్నది. నాగర్ కర్నూల్ జిల్లాలో 2,87,104 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 31,429 మెట్రిక్ టన్నుల బియ్యం రాగా, ఇంకా 1,61,962 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 40294 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను మిల్లర్లు ఇప్పటివరకూ 5927 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వగా, మరో 21,214 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది.

ఆ ధాన్యం అమ్ముకున్నారు..?

రీసైక్లింగ్ బియ్యంతో బయటపడేయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు తమ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఎన్ని నోటీసులు జారీ చేసినా.. తనిఖీలు చేసిన మిల్లర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సీఎంఆర్ ను ఎఫ్సీఐకి ఇవ్వకపోవడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జూన్ 30వ తేదీ వరకు మిల్లర్లు 100శాతం సీఎంఆర్ ను ఎఫ్సీఐకి స్వాధీనపరచాలని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రభుత్వం మరోసారి 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్ణీత గడువు లోపు సీఎంఆర్ ను స్వాధీన పరచాలని ఒత్తిడీలు తెస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed