పెద్దవంగరలో మట్టి మాఫియా.. పట్టించుకోని అధికారులు

by samatah |   ( Updated:2023-05-11 04:05:57.0  )
పెద్దవంగరలో మట్టి మాఫియా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, పెద్దవంగర : పెద్దవంగర మండలంలో ఇటీవలీ కాలంలో మట్టి, మొరం ఇసుక అక్రమ రవాణాజోరుగా సాగుతోంది. మట్టి మాఫియా ధనదాహానికి ఎస్సారెస్పీ కాల్వలు, చెరువులు, కుంటలు కనుమరుగైపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లు, భవనాలు తదితర అభివృద్ధి నిర్మాణ పనుల పేర ప్రైవేటు, ప్రభుత్వ భూముల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, మొరం, ఇసుక తరలిస్తున్నారు. అక్రమార్కులు రూ.లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మండలంలో ప్రైవేట్​భూముల నుంచి మట్టి, ప్రధాన కాల్వ ఎస్సారెస్పీ నుంచి మొరం, తిరుమలగిరి మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అక్రమ దందాలను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు చేసినా హెక్టార్‌కు రూ.50వేలు, గనుల శాఖకు మరో రూ.50వేలు రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాలి. మట్టి లేదా మొరం విక్రయంపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఈ చార్జీలేవీ వ్యాపారులు చెల్లివంచడం లేదు. పెద్దవంగర, ఉప్పరగూడెం ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలో మొరం తవ్వకాలు, పలు గ్రామాల్లో చిన్న చిన్న కుంటల్లో మట్టి తవ్వకాలు, తిరుమలగిరి మండలం నుంచి ఇసుక రవాణా చేపడుతున్నారు. రహదారుల నిర్మాణాలకు మొరం అవసరం కావడంతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు మొరం తవ్వకాలు చేసుకోవడానికి జిల్లాలోని సంబంధిత శాఖల అధికారుల సిఫారుసుతో క్వారీల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా మండల తహసీల్దార్లు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తారు. కానీ నిబంధనలు పాటించకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎస్సారెస్పీ కాల్వలను మొరం కోసం తవ్వకాలు చేస్తున్నారు. చివరకు చెరువు శిఖం భూములను కూడా వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేస్తూ స్థానికంగా నిర్వహించే పనులకు తరలిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.

కనుమరుగవుతున్న ఎస్సారెస్పీ కాల్వ మట్టి..

పెద్దవంగర, ఉప్పరగూడెం, గట్లకుంట, రామచంద్రు తండా గ్రామాల్లో మొరం అక్రమ దందా జోరుగా కొనసాగుతున్నది. మొరం తరలిస్తున్న వారిని ప్రజలు నిలదీస్తే ప్రభుత్వ పనులకంటూ సమాధానం చెబుతున్నారు. ప్రతీ రోజు టిప్పర్లు, ట్రాక్టర్లలో మొరం తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. చెరువు శిఖంలోని సారవంతమైన మట్టిని ఇటుకల వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో అధికారుల నిఘా తక్కువగా ఉండడంతో దందా నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలోని సహజవనరులను కొల్లగొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల అండతోనే..

అక్రమార్కులు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో దందాకు తెరతీస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు దినపత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు వారం రోజులపాటు పనులు నిలిపివేసి సద్దుమణిగాక మళ్లీ మొదలుపెట్టడం చూస్తే అధికారులే అక్రమ రవాణాకు వెన్నుదన్నులా ఉన్నారనేది స్పష్టమవుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు స్పందించి మట్టి, మొరం మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా..

అక్రమంగా మట్టి తరలింపుపై ఎటువంటి సమాచారం రాలేదు. ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. గతంలో మా దృష్టికి వస్తే చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం మట్టిని తరలించేందుకు ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఎవరైనా అనుమతులు లేకుండా రవాణా చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

– తహసీల్దార్‌ రమేష్ బాబు

Advertisement

Next Story

Most Viewed