జడ్చర్ల: కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య తోపులాట.. ఏ విషయంలో అంటే..

by Kalyani |
జడ్చర్ల: కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య తోపులాట.. ఏ విషయంలో అంటే..
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, టీపీసీసీ కార్యదర్శి అనిరుద్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదివారం మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల పట్టణంలోని ప్లైఓవర్ వద్ద ఎర్ర శేఖర్ వర్గానికి చెందిన కార్యకర్తలు అనిరుద్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ గజమాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తాము గజమాల ఏర్పాటు చేసిన వద్ద మీరు ఎలా ఏర్పాటు చేస్తారని ఇరువర్గాల వారు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తమదే అంటే తమదే అంటూ ఎర్ర శేఖర్, అనిరుద్ రెడ్డి లు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండగా ఇద్దరి అనుచరుల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా విభేదాలు తారాస్థాయికి చేరాయి.

కాంగ్రెస్ కష్ట కాలంలో ఉండి అధికారం కొరకు శ్రమించాల్సిన సమయంలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో నాయకుల మధ్య విభేదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని సగటు కాంగ్రెస్ కార్యకర్త ప్రశ్నిస్తున్నారు. కాగా తోపులాట సమయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన చెట్ల కుండీలు ధ్వంసమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed