నాలుగు నెలల్లోనే.. ఇన్ని దుర్మార్గాలా...!? కేసీఆర్​ ఆగ్రహం

by Disha Web Desk 11 |
నాలుగు నెలల్లోనే.. ఇన్ని దుర్మార్గాలా...!? కేసీఆర్​ ఆగ్రహం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/నాగర్ కర్నూల్: అడ్డగోలు హామీలతో.. కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలకుల దుర్మార్గాలు పెరిగిపోయాయి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భవించి.. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన చేసుకున్న శుభదినం. అన్నమో... అటుకులో తిని పార్టీని మహాసముద్రంలో చేసుకున్నాం.

పాలమూరు ఎంపీగా ఉండి ప్రాణాలు పణంగా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. సాధించుకున్న తెలంగాణ గులాబీ జెండా నీడలో అన్ని వర్గాల ప్రజలను కాపాడుకున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం.. వ్యవసాయ రంగాన్ని పండగల చేసాం.. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికలలో అడ్డగోలు వాగ్దానాలు చేసి .. కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది అని చెప్పారు. ఇప్పటివరకు.. మీ అందరికీ రైతుబంధు వచ్చిందా..!? రుణమాఫీ జరిగిందా..!? వరి ధాన్యానికి బోనస్ వచ్చిందా..!? మహిళలకు స్కూటీ వచ్చిందా..!? 24 గంటలు కరెంటు వస్తుందా..అని మాజీ సీఎం ప్రశ్నిస్తే.. లేదు లేదు అంటూ జనం జవాబు ఇవ్వడంతో.. ముఖ్యమంత్రి ఇదో మీ ప్రభుత్వం వచ్చాక.. పరిస్థితులు ఇలా అయ్యాయి.. ఇక్కడి నుండి ప్రజల తరఫున మాట్లాడుతున్నాను అని అన్నారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. కరెంటు కోతలు, తదితర కారణాలవల్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 220 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయాయి. గ్రామాలలో సాగునీరు సంగతి అటు నుంచి.. కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయని కేసీఆర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు అక్కరకు రాని చుట్టం.. ఆయన 100 నీతి మాటలు చెప్పిండు. కానీ అవి అమలు కాలే.. మన రాష్ట్రానికి మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాల ఒకటి కూడా ఇవ్వలే.. అటువంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలి అన్నారు. ఈ జిల్లాకు గుజరాత్ ముఖ్యమంత్రి రావలసిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

సంస్కారం లేకుండా నాపై విమర్శలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి కి సమాధానం చెప్పాలంటే మీరు బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులకు కాకుండా.. సెక్యులర్ భావాలతో .. రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేసే బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీరిచ్చే బలముతో ఈ పాలకుల మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని చెప్పారు. రానున్న రోజులలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసుకుని.. రాష్ట్రాన్ని కాపాడుకుంటానని స్పష్టం చేశారు. అంతకుముందు దారి పొడుగున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed