చేతులు తడిపితే.. వాహనం కదిలేనా..?

by Disha Web Desk 23 |
చేతులు తడిపితే.. వాహనం కదిలేనా..?
X

దిశ,గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం స్టేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన అంతర్‌రాష్ట్ర ఆర్‌టీఏ చెక్‌పోస్టులో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టులో చెల్లించాల్సిన బార్డర్‌ ట్యాక్స్‌, టెంపర్వరీ పర్మిట్‌ ఫీజు, అపరాధ రుసుం, వాహన ఇన్సూరెన్స్, తదితర దృవపత్రాలు ఆర్టీవో చెక్ పోస్టులో తనిఖీలు చేయాలి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి చర్యలు చేపట్టాలి. కానీ చేతులు తడపనిదే వాహనాలు వదలడం లేదంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. అన్ని రకాల దృవపత్రాలు ఉన్న చెక్ పోస్టులో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అన్ని రకాల దృవపత్రాలున్న ఆర్టిఏ సిబ్బంది ప్రతి వాహనం పై రూ.500 నుంచి వసూళ్లు చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపించారు.

అంతేకాకుండా ఈ చెక్ పోస్ట్ లో కొందరు ప్రైవేటు వ్యక్తులు అధికారుల కనుసైగల్లో అక్రమ వసూళ్లకు పాల్పడటం విశేషం. ఈ చెక్ పోస్ట్ పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని అక్రమంగా సంపాదిస్తున్నారని వినికిడి. చెక్ పోస్టులో జరుగుతున్న వసూళ్లపై పట్టించుకునే నాధుడు లేకపోవడంతో అవినీతి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో గండి..

అక్రమ రవాణాను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం స్టేజ్ సమీపంలో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. ఈ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి, వస్తువుల రవాణాకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయో..? లేవో..? చెక్ చేయాలి. కానీ ఇదంతా ఏం జరగకుండా చేతులు తడిపితే వాహనాలు వదిలేస్తున్నారు. చెక్ పోస్ట్ లో వాహనాల్లో రవాణా చేస్తున్న వస్తువుల బిల్లులు తనిఖీ చేసి వాహనాలు వదలవలసి ఉంటుంది. సదరు వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. లేదంటే, అధికారులు వాహనంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి. కానీ ఇక్కడే కొందరు అవినీతికి తెర లేపారు. పత్రాలు ఉన్నా లేకున్నా వాహనదారుల నుంచి డబ్బులు దండుకొని వాహనాలు వదిలేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి విచ్చలవిడిగా సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.

పెద్ద సార్ ఉన్నారు...

మానవపాడు మండలం జల్లాపురం స్టేజ్ సమీపంలోగల అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులో పెద్ద సార్ ఉన్నారంటూ వాహనదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పెద్ద సారు ఎవరనేది సిబ్బందికి మాత్రమే తెలుసు. పెద్ద సారు అంటే జిల్లా రవాణా శాఖ అధికారి లేక మరెవరు? వాహనానికి ఏ చిన్న కాగితం లేకున్నా వాహనం సీజ్ అవుతుందేమోనని వాహనదారులు భయపడి తమ జేబులో ఉన్న డబ్బులను సిబ్బందికి ఇచ్చి అక్కడ నుంచి జారుకుంటున్నారు. సిబ్బంది బహిరంగానే వసూళ్లు చేస్తున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాహనదారులు వాపోతున్నారు.


Next Story

Most Viewed