గద్వాలలో వేడెక్కిన రాజకీయం..

by Sumithra |
గద్వాలలో వేడెక్కిన రాజకీయం..
X

దిశ, గద్వాల ప్రతినిధి : గద్వాల రాజకీయం రసవంతంగా నడుస్తుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారన్న ప్రచారంతో మరోసారి గద్వాల రాజకీయాలు వేడెక్కాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కృష్ణ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య పోటీ చేసి 7036 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ముందు నుంచి ఆధిపత్య పోరు..

గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సరితా తిరుపతయ్య, బండ్ల కృష్ణ మోహన రెడ్డి మధ్యన ముందు నుంచి ఆధిపత్య పోరు నడుస్తుంది. జెడ్పీ ఛైర్పర్సన్ గా ఉన్న సరితా తిరుపతయ్యకు ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లకు రాజకీయంగా గ్యాప్ ఉన్నది. జడ్పీ సమావేశాలకు ఎమ్మెల్యే దూరంగా ఉండడం తన జెడ్పీటీసీలను జెడ్పీ సమావేశాలకు హాజరు కాకుండా చేశారని సరితా తిరుపతయ్య వర్గం గతంలో ఆరోపించారు. ఎమ్మెల్యే ఎన్నికల కొన్ని నెలల ముందు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికకు పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య మధ్యన పోటీ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు.

అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో గద్వాల నియోజకవర్గంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితా తిరుపతయ్య మాటే చెల్లుబాటు అవుతూ వస్తుంది. నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ దాదాపు ఆమె కనుసన్నల్లో వుండే అధికారులను వచ్చారని ప్రచారం నడుస్తుంది.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు

గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే రాకను కాంగ్రెస్ కార్యకర్తలు, సరితా తిరుపతయ్య అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలోకి అధిష్టానం తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని కార్యకర్తలు తెలుపుతున్నారు. గద్వాల పట్టణంలోని లింగం బాగ్ కాలనీ లోని సెల్ టవర్ ఎక్కి సరితా తిరుపతయ్య అభిమాని ప్రసాద్ నిరసన చేపట్టారు.

సెల్ టవర్ వద్దనే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్త ధర్నా సందర్భంగా గద్వాల పట్టణంలో పురుగుల మందు తాగే ప్రయత్నం చేయడంతో పక్కనే ఉన్న కార్యకర్తలు నిలువరించారు. నియోజకవర్గంలో ఒక వైపు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి మారేందుకు అన్నిరకాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ఇంతలోనే నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Next Story

Most Viewed