ప్రకృతి వ్యవసాయదారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి..

by Sumithra |
ప్రకృతి వ్యవసాయదారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి, నేల తల్లిని సంరక్షిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఉమ్మడి పాలమూరు జిల్లా సేంద్రియ వ్యవసాయ రైతు దామోదర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రం న్యూటవున్ లోగో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి సేంద్రియ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయి రైతులకు తెలియక పోవడం వల్ల వినియోగించుకోలేక పోతున్నారు విచారం వ్యక్తం చేశారు.

దిగుబడి రాకపోయినప్పటికీ మూడు, నాలుగేళ్లపాటు నష్టాలను ఎదుర్కొంటూ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల సాంప్రదాయ వరి రకాలను పండిస్తున్నప్పటికీ స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనివ్వాలని, ఉత్పత్తులను అమ్ముకోవడానికి జిల్లా కేంద్రంలో విక్రయకేంద్రం కోసం మున్సిపల్ దుకాణ సముదాయాల్లో ఒక దుకాణాన్ని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జిల్లాస్థాయిలో ప్రకృతి వ్యవసాయ రైతుల సమస్యల పై సదస్సును ఏర్పాటు చేసి సమస్యలను స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారులు, రఘువర్ధన్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి తిరుపతయ్య, రాజనరసింహ, భాస్కర్ రెడ్డి, రాము, శ్రీనివాసులు, అచ్యుత రెడ్డి, గుముడాల చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed