ఐదు వేల మందికి ఒకేసారి ఇండ్లు ఇవ్వండి: డీకే అరుణ

by Kalyani |   ( Updated:2023-04-15 13:04:28.0  )
ఐదు వేల మందికి ఒకేసారి ఇండ్లు ఇవ్వండి: డీకే అరుణ
X

దిశ, గద్వాల: గద్వాలలో 5 వేల మంది లబ్ధిదారులకు ఒకేసారి డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయాలని మాజీమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సభలో కేసీఆర్ గద్వాలకు ఏడాదికి 5 వేల ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల నుంచి ఎన్ని ఇండ్లు కట్టించారో తెలపాలని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు గద్వాల పట్టణంలో ఇండ్లు లేక చాలా కుటుంబాలు ఉన్నాయానే ఉద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం స్థలం సేకరించి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.

తాను ఇచ్చిన పట్టాలను లాక్కొని ఎన్నికల వేళ ఆటోలో తరలించి రెండు పడకల గదులను ఇస్తామని ఆశ చూయించి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. డిప్ ద్వారా ఇండ్లు కేటాయింపు ఒక బుటకం అన్నారు. ఇల్లు ఉన్నవారికే ఇచ్చి పేదలను మరోసారి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేర్లతో సీఎం కేసీఆర్ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యం అంటూ అధికార పార్టీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, పంచాయతీ భవనాలు, తదితర వాటిని నిర్మించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పాలకులు కళ్లు తెరిచి ఒకసారి అభివృద్ధిపై ఆత్మ పరీక్ష చేసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బండల వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed