‘రాణి’స్తున్నారు.. ఉమ్మడి జిల్లాలో ఐదు జెడ్పీ చైర్మన్ పదవుల్లో నలుగురు మహిళలే

by Mahesh |
‘రాణి’స్తున్నారు.. ఉమ్మడి జిల్లాలో ఐదు జెడ్పీ చైర్మన్ పదవుల్లో నలుగురు మహిళలే
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహిళలకు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారడానికి ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్లే నిదర్శనం. ఉమ్మడి జిల్లాలో ఐదు జెడ్పీ చైర్మన్ స్థానాలకు గాను నాలుగు స్థానాల్లో మహిళలు పాలన సాగిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. జనరల్ స్థానాలలో సైతం ఊహించని విధంగా అవకాశాలను దక్కించుకొని పురుషులకు ఏమాత్రం తీసుపోమంటూ ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయంగా 'రాణి'స్తున్నారు. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికినీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ మహిళలకే కాదు, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్లపై ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు కావడంతో మహిళలకు పెద్ద మొత్తంలోనే అవకాశాలు దక్కాయి. జనరల్ స్థానమైన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా స్వర్ణ సుధాకర్ రెడ్డి, బీసీ జనరల్ స్థానమైన నారాయణపేట జెడ్పీ చైర్ పర్సన్ గా వనజ, బీసీ మహిళకు కేటాయించిన జోగులాంబ గద్వాల జిల్లా చైర్ పర్సన్ గా సరిత, ఎస్సీ జనరల్ స్థానమైన నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్ పర్సన్ గా శాంత కుమారి పాలన సాగిస్తున్నారు.

పుట్టింట.. మెట్టింట రాజకీయాలు..

మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పుట్టిల్లు.. మెట్టినిల్లు రాజకీయ నేపథ్యం కలిగి ఉండటంతో తన దృష్టిని రాజకీయాల వైపు సారించారు. తన తండ్రి సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేయడం... తన మామగారు సమితి ప్రెసిడెంట్‌గా పనిచేసిన నేపథ్యంలో సుధాకర్ రెడ్డి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. మొదట్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమరచింత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఆమె దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు‌తో హరీశ్ రావు విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఈ క్రమంలో భూత్పూర్ జెడ్పీటీసీ గా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

రాజకీయ నేపథ్యం అవకాశం కల్పించింది..

నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్ కుటుంబం కూడా మొదటి నుంచి రాజకీయ నేపథ్యం కలిగినదే. వనజ మక్తల్ జెడ్పీటీసీగా గెలుపొంది చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా మక్తల్ మండలంలోని మంతన్గోడు గ్రామంలో సర్పంచ్ గాను, ఎంపీటీసీలు సేవలు అందించారు. వనజ ఆంజనేయులు గౌడ్ సైతం సర్పంచ్ గాను, ఎంపిటిసి గాను పనిచేశారు. ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయం చేసుకుంటూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వనజ ముందుకు సాగుతున్నారు.

కుటుంబ సభ్యులకు ప్రోత్సాహంతో...

జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా సరితా తిరుపతయ్య కొనసాగుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన సరిత కుటుంబం సైతం రాజకీయ నేపథ్యం ఉన్నది. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలుగా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని బీసీ మహిళలకు కేటాయించడంతో సరిత మానవపాడు జెడ్పీటీసీగా పోటీ చేసే విజయం సాధించడంతో జెడ్పీ చైర్ పర్సన్ పీఠం దక్కింది. రాజకీయంగా ఆమెకు పలు ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.

అనుకోని అవకాశం..

నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ గా ఊరుకొండ మండలం రేవల్లి గ్రామానికి చెందిన శాంత కుమారి అనుకోని అవకాశం దక్కింది. మొదట్లో జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన పద్మావతికి ముగ్గురు సంతానం ఉండడంతో ఆమె ఎంపికను న్యాయస్థానం రద్దు చేయడంతో అనూహ్య పరిణామాల నేపథ్యంలో శాంతకుమారికి అవకాశం లభించింది. విద్యావంతురాలైన శాంతకుమారి కుటుంబం సైతం రాజకీయ నేపథ్యం కలిగినది కావడంతో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

Next Story