మద్యం మత్తులో అటవీశాఖ ఉద్యోగి హల్‌చల్.. వ్యాపారస్తుడిని బ్లాక్‌మెయిల్ చేస్తుండగా..

by S Gopi |   ( Updated:2022-08-29 16:39:35.0  )
మద్యం మత్తులో అటవీశాఖ ఉద్యోగి హల్‌చల్.. వ్యాపారస్తుడిని బ్లాక్‌మెయిల్ చేస్తుండగా..
X

దిశ, అచ్చంపేట: మద్యం సేవించిన ఒక ఉద్యోగి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ ఒక వ్యాపారస్తుడిని భయపెట్టి హల్చల్ చేసిన సంఘటన సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే అచ్చంపేట పట్టణంలోని నెహ్రూ చౌరస్తా సమీపంలో మద్యం మత్తులో ఉన్న అటవీ శాఖ ఉద్యోగి జాంగిర్ అని పేరు చెప్పుకుంటూ ఓ కిరాణం దుకాణం యజమానిని దబాయించి తనకు మామూలు ఇవ్వాలని హంగామా చేశాడు. మామూలు ఇవ్వకపోతే ఉన్నత అధికారులకు లేనిపోనివి చెప్పి ఇబ్బందులకు గురి చేస్తానని సదరు షాపు యజమానిని భయభ్రాంతులకు గురి చేశాడని షాపు వద్దకు సరుకుల కోసం వచ్చినవారు తెలిపారు. చేసేది లేక ఆ వ్యాపారి రూ. 200 చేతుల పెట్టి తమరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వేడుకున్నాడని స్థానికులు తెలిపారు.

ఎవరికి భయపడేది లేదు..

ఈ క్రమంలో సమయానికి పక్కనే ఉన్న మీడియా ఆ అటవీ శాఖ ఉద్యోగి చేస్తున్న హంగామాను గమనించి ఎందుకు గందరగోళం చేస్తున్నావని అడుగగా దురుసుగా సమాధానం చెబుతూ... తనను ఎవరు ఏమి చేయలేరని, తాను ఎవరికి భయపడేది లేదని, ఏమి రాసుకుంటారో మీకు నచ్చింది రాసుకోమని ఆ ఉద్యోగి అరుస్తున్న తీరును బజారులో ఉన్న జనం గుమిగూడుతున్న సందర్భంగా అతని నిర్వాకం గమనిస్తున్న సమయంలో అతనితో వచ్చిన మరో రిటైర్డ్ అటవీశాఖ ఉద్యోగితో కలిసి తిన్నగా జారుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ మామూలు వసూలు చేసిన జాంగిర్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story