భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి : గద్వాల్ కలెక్టర్

by Aamani |
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి : గద్వాల్  కలెక్టర్
X

దిశ, గద్వాల్ కలెక్టరేట్ : నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవితో కలిసి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమని అన్నారు. అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు.పిల్లల అభ్యాసం, వారి సమగ్ర అభివృద్ధికి బాల సదన్ మంచి గుణాత్మక విద్యతో పాటు,వివిధ కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శ్రద్ధ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని పేర్కొంటూ, పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవి మాట్లాడుతూ...పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ చిల్డ్రన్స్ హోమ్ మీకు భద్రతగా, సురక్షితంగా ఉంటుందని అన్నారు. మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, మీ అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని అన్నారు. పిల్లలు సంతోషంగా ఉండి, బాగా చదివి, జీవితంలో విజయవంతులు అవ్వాలని అన్నారు. బాలసదనాన్ని తరచుగా సందర్శిస్తూ ఉంటారని, ఇక్కడ పిల్లలందరికీ విద్యతో పాటు మంచి భోజనం పౌష్టికాహారం తో పాటు వ్యక్తిగత ప్రత్యేక శ్రద్ధ అందించడం జరుగుతుందన్నారు. బాల సదనంలో ఉన్న పిల్లలందరూ అదృష్టవంతులని తెలిపారు.

అనంతరం బాలల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈనెల 8 నుంచి 14 వ తేదీ వరకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మెమెంటోలు, స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవులు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story