పాలమూరు యూనివర్సిటీ వీసీగా డాక్టర్ జి.ఎన్ శ్రీనివాస్

by Naveena |
పాలమూరు యూనివర్సిటీ వీసీగా  డాక్టర్ జి.ఎన్ శ్రీనివాస్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పాలమూరు విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ జి ఎన్ శ్రీనివాస్ నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గుల్యాల నరసయ్య, ఎల్లవ్వ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించిన శ్రీనివాస్ తన సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదివారు. కామారెడ్డి లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ సి ఈ లో ఇంజనీరింగ్ ఎం ఈ, పీహెచ్ డీ పూర్తి చేశారు. అనంతరం ఆయన 1995లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లెక్చరర్ గా ఎంపికై బాధ్యతలు నిర్వహించి ,అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 2006వ సంవత్సరం వరకు పనిచేశారు. 2006 నుంచి 2010 వరకు జేఎన్టీయూసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2011 నుండి 2020 వరకు ఇదే కళాశాలలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2021 నుంచి ఇప్పటివరకు సీనియర్ ప్రొఫెసర్ గా కొనసాగుతూ ఉన్నారు. పవర్ సిస్టం ఆఫ్ రియాబిలిటీ అంశంతో పరిశోధనలు చేసి.. డాక్టరేట్ సాధించిన శ్రీనివాస్ నిరాడంబరుడుగా.. మేధావిగా పేరుగాంచడంతోపాటు.. అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల గవర్నమెంట్ బాడీ సభ్యునిగా.. గత దశాబ్ద కాలం నుంచి పనిచేశారు. ఈ కళాశాల అటానమస్ స్థాయికి చేరడంలో శ్రీనివాస్ కళాశాల యాజమాన్యానికి అధ్యాపకులకు మార్గదర్శకంగా వ్యవహరించారు. శ్రీనివాస్ పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో..పలువురు విద్యావేత్తలు, పాలమూరు విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed