బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి భంగపాటు.. పార్లమెంట్ సన్నాహక సమావేశానికి అందని ఆహ్వానం

by Shiva |
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి భంగపాటు.. పార్లమెంట్ సన్నాహక సమావేశానికి అందని ఆహ్వానం
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలబోతోంది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ పార్టీ మారెందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. రెండుసార్లు తన కుమారుడు భరత్‌కు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని పదవిని మరొకరికి కట్టబెట్టారని ఆయన అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భరత్ మరోసారి అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయింది.

ఇందుకు తోడు ఎన్నికల నోటిఫికేషన్‌‌కు ముందు కొల్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు‌ను కేసీఆర్ ప్రారంభించే సందర్భంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం‌లో ఎంపీ రాములు పేరు కూడా లేదు. ఈ క్రమంలో కావాలనే తనను పార్టీలో కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారని ఎంపీ రాములు పలు సందర్భాలలో తన స్నేహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ అచ్చంపేట, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు తాజా మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు.

కానీ, ఎంపీ రాములుకు ఆహ్వానం అందలేదు. ఈ విషయం కాస్త కేటీఆర్‌కు తెలియడంతో ఆయన తన పీఏ ఫోన్ ద్వారా మధ్యాహ్నం నాగర్ కర్నూల్‌లో జరిగే సన్నాహక సమావేశానికి హాజరు కావలసిందిగా తెలిపాడు. తనకు ఆహ్వానం లేనిది సమావేశానికి ఎలా రావాలంటూ ఎంపీ రాములు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీలో ఉండడం కన్నా పార్టీ మారడమే సమంజసం అన్న నిర్ణయానికి ఎంపీ రాములు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కుమారుడు భరత్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఒకటి, రెండు రోజులలో తమ అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed