'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తాం'

by Sumithra |
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తాం
X

దిశ, గద్వాల : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని, పార్టీ మారే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు, నాయకులు మోనేష్ మారోజు, తిరుమల్, వెంకటేష్, తదితరులు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో బాసుశ్యామల హనుమంతు నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాసు శ్యామల హన్మంతు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తొలి సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటూ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. నాడు ఆర్డీఎస్ సాధించుకోవడానికి కేసీఆర్ చేపట్టిన పాదయాత్రలో నడిగడ్డ నుంచి ఉద్యమకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కేసీఆర్ అడుగుజాడల్లో మా కుటుంబం ఉద్యమ కాలం నుండి నేటి వరకు కొనసాగిస్తూ వస్తున్నామని, కొన్ని అనివార్యకారణాల వల్ల తమ కుటుంబానికి గద్వాల ఎమ్మెల్యే పదవి దక్కకున్న పార్టీ కోసం కష్టపడి, భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేశామన్నారు‌.

బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణకు కవచం అని, తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటుపడుతుందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమని చెప్పారు. ఆరు గ్యారెంటీల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ హామీలు అమలు పరచడంలో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన నడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ ఉందని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి‌ చేస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించి నడిగడ్డలో పార్టీ బలోపేతం చేస్తామని, ఎవరూ అధైర్యపడకుండా పార్టీలో కొనసాగించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed