Collector : స్వచ్చదనం - పచ్చదనంలో ప్రజలు భాగస్వాములు కావాలి..

by Sumithra |
Collector : స్వచ్చదనం - పచ్చదనంలో ప్రజలు భాగస్వాములు కావాలి..
X

దిశ, కొత్తపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. స్వచ్చదనం - పచ్చదనంలో భాగంగా రెండో రోజైన మంగళవారం జిల్లా కలెక్టర్ కొత్తపల్లి మండలం భూనేడు గ్రామపంచాయతీని సందర్శించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా మార్చాలనే సంకల్పంతో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందని ఇంతటి మంచి కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ముఖ్యంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామానికి తమ సేవలను అందించాలని కోరారు. స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమాన్ని రెండవ రోజు భూనీడ్ గ్రామ పంచాయతీలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. మంగళవారం నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని తమ ఇంటి పరిసరాలలో నీటి నిల్వలేకుండా చూడాలన్నారు. తాగునీటి ట్యాంకులలోని నీటిని క్లోరినేషన్ చేయాలన్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే విలేజ్ న్యూట్రిషన్ డే జరుపుకుంటున్నారా ? లేదా ఫీవర్ సర్వే అయిందా అని కలెక్టర్ ఆశావర్కర్లను అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.

విలేజ్ న్యూట్రిషన్ డే సందర్భంగా నిర్వహించవలసిన సేవలను వారికి గుర్తు చేశారు. అంతకు ముందు కలెక్టర్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రాంగణంలో మొత్తం మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుదర్శన్, తహశీల్దార్ అనిల్, ఎంపీఓ రామన్న, గిర్దవార్ మధు, ఏపీఎం నారాయణ, పంచాయతీ కార్యదర్శి రఫీ పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed