మండే ఎండలో రాజకీయ కాక..!

by Disha Web Desk 12 |
మండే ఎండలో రాజకీయ కాక..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ కాక రేపుతోంది. మండువేసవిలో వచ్చిన ఈ ఎన్నికలు ఎండల తీవ్రత లాగే.. రాజకీయ తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. ఈ అభ్యర్థులు గెలుపు కోసం సాగిస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండగా.. నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి, బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్న విషయము పాఠకులకు విధితమే.. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రచారం తో పాటు.. అటు వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎత్తులకు.. పై ఎత్తులు

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ వర్గాలలో పోటీలో ఉన్న అభ్యర్థులు అందరూ రాజకీయ ఉద్దండులు కావడంతో.. గెలుపు కోసం వ్యక్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల లోని మండల స్థాయి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు, అప్పుడప్పుడు సర్వేలు చేస్తూ.. అనుకూల.. అననుకూల పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే వాటిని మరింత మెరుగు పరుచుకోవడం.. లేదంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఏ విధమైన ఎత్తుగడలు వేయాలి అనే అంశాలపై చర్చలు జరుపుకొని వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థుల బలాలను దెబ్బతీసేలా.. ప్రసంగాలు సాగిస్తున్నారు. ఈ ప్రసంగాలు వాడిగా.. వేడిగా సాగుతున్నాయి. అటు రాజకీయ పరంగానే కాకుండా. ఇటు వ్యక్తిగత విమర్శలు కూడా సాగడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తర చర్చలు జరగడానికి కారణం అవుతున్నాయి.

గెలుపు అంత సులభం కాదు

ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి కూడా గెలుపు అంత సులభం కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే అయినప్పటికీ తమ అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో చెమటలోడుస్తున్నారు. ఈ వారం రోజులలో పడే శ్రమ, వ్యూహరచనలు కీలకం కావడంతో.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానించి ప్రత్యేక సభలు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు నిర్వహించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎంపీ ఎన్నికలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి.

Next Story

Most Viewed