పోలేపల్లి పంచాయతీలో రికార్డుల టాంపరింగ్ కు యత్నం..?

by Kalyani |
పోలేపల్లి పంచాయతీలో రికార్డుల టాంపరింగ్ కు యత్నం..?
X

దిశ,జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని పోలేపల్లి పంచాయతీలో రికార్డులు ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలకమైన ఈ పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సంబంధిత గ్రామ పంచాయతీ పాత సెక్రటరీ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలేపల్లి పంచాయతీ సెక్రటరీ గా శివప్రసాద్ గత ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగున్నర ఏళ్ళ పాటు పని చేశారు. ఆయన సెక్రటరీగా కొనసాగిన కాలంలో పంచాయతీలో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. వీటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శివప్రసాద్ ను పోలేపల్లి నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో లక్ష్మీనారాయణ ను సెక్రటరీ గా నియమించారు.

లక్ష్మీనారాయణ పోలేపల్లి పంచాయతీ సెక్రటరీ గా గత జూలై నెల 20 వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత సెక్రటరీ పంచాయతీకి సంబంధించిన రికార్డులనన్నింటినీ కొత్త సెక్రటరీకి అప్పగించాలి. సెక్రటరీగా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా శివప్రసాద్ ఇప్పటి వరకు ఆయనకు రికార్డులు అప్పగించలేదు. శివప్రసాద్ ఇప్పటివరకు రికార్డులను అప్పగించకపోవడం గురించి లక్ష్మీనారాయణ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినా రికార్డుల అప్పగింతకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పోలేపల్లి పంచాయతీలో గత నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఆరు కోట్ల దాకా ఆర్థిక లావాదేవీలు జరగ్గా వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తన పదవి కాలంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పాత సెక్రటరీ శివప్రసాద్ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తుండవచ్చునని అందువల్లనే ఆయన కొత్త సెక్రటరీ లక్ష్మీనారాయణకు రికార్డులను అప్పగించడంలో తాత్సారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలేపల్లి పంచాయతీ రికార్డులను నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్త సెక్రటరీ లక్ష్మీనారాయణకు అప్పగించడంలో పాత సెక్రటరీ శివప్రసాద్ తాత్సారం చేస్తున్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, రికార్డుల అప్పగింత విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎంపిడిఓ కు తెలిపానని,ఒకవేళ ఎంపిడిఓ స్పందించకుంటే ఆయనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు కూడా చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయం పై ఎంపిడిఓ విజయ్ కుమార్ ను " దిశ ప్రతినిధి " వివరణ కోరగా పాత సెక్రటరీ శివప్రసాద్ పై చర్యలు తీసుకోవడంలో తాను ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదని, తన దృష్టికి పాత సెక్రటరీ శివప్రసాద్ రికార్డుల అప్పగింత విషయంలో తాత్సారం చేస్తున్న విషయం వచ్చిన వెంటనే ఆయన జీతం ఆపడం జరిగిందని, అలాగే జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి ఆయన వ్యవహారం గురించి తెలపడం జరిగిందని, డిపిఓ కూడా పంచాయతీని సందర్శించి అందుకు సంబంధించిన వివరాలు సేకరించారని, తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అధికారం తనకు లేదని, ఆ అధికారం డిపిఓ, జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed