మెడికల్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

by Sridhar Babu |
మెడికల్ కళాశాల ప్రారంభానికి  ఏర్పాట్లు పూర్తి చేయాలి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద నిర్మించిన నూతన మెడికల్ కళాశాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మంగళవారం మెడికల్ కళాశాల మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 32 ఎకరాల స్థలంలో నిర్మించిన మెడికల్ కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, ప్రధాన రహదారి నుంచి కళాశాల వరకు రోడ్డును వేయాలని టీజీఎంఐ డీసీ అధికారులకు సూచించారు. కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూలు ఖరారు కాకముందే అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ పైప్ లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ ఈఈ ని ఆదేశించారు. అలాగే కళాశాలలో విద్యుత్ సౌకర్యం, జనరేటర్, సీసీ కెమెరాలను ఎక్కడెక్కడ అమర్చాలో పోలీసు, ట్రాన్స్ కో, మిషన్ భగీరథ, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి మూడు రోజులలోపు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఐసీయూ, క్యాజువాలిటీ, ఆక్సిజన్, నీటి వసతి, ఆపరేషన్ థియేటర్ కు ప్రత్యేకంగా ఒక జనరేటర్, గైనకాలజిస్ట్ లు, చిన్నపిల్లల వైద్య నిపుణులు అవసరమని కళాశాల ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. వీటితోపాటు సిటీ స్కాన్ కూడా అవసరం ఉంటుందని తెలిపారు. కళాశాల ఆవరణలోనే నర్సింగ్ కాలేజీకి, ఎంసీఎచ్ విభాగానికి సరిపడా నీటి వసతి కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఉంటుందని వివరించారు.

ఈనెల 26న బీఎల్ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్ట్) శిబిర నిర్వాహణ కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వస్తుందని, నారాయణపేటలో ఏర్పాటు చేసే బీఎల్ఎస్ కు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, పోలీసు శాఖలో అత్యవసర సేవలు అందించే సిబ్బంది, మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. లాండ్రీ ,పార్కింగ్, పోలీస్ అవుట్ పోస్ట్, టాయిలెట్ కాంప్లెక్స్, పోలీస్ పెట్రోలింగ్ తదితర అంశాల గురించి సమావేశంలో ప్రస్తావించారు. వాటన్నిటికీ ఎంఐడీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు. ఓపీ సమయానికి బస్సులను కళాశాల లోపలికి వచ్చేలా తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నిస్తానని డీఎం లావణ్య తెలిపారు.

జిల్లా ఆస్పత్రి మందుల సరఫరా కు సంబంధించి కేవలం వంద పడకల సామర్ధ్యానికే అనుమతి ఉందని, ప్రస్తుత జిల్లా ఆస్పత్రి 390 పడకల తో ఏర్పాటు చేస్తే అందుకు సరిపడా మందుల సరఫరా ఇండెంట్ పంపాల్సి ఉంటుందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని కలెక్టర్ సూచించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, ట్రాన్స్ కో ఎస్ఈ ప్రభాకర్, ఆర్అండ్బీ డీఈ రాములు, సీఐ శివశంకర్, మెడికల్ కళాశాల వైద్య బృందం పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed