ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Javid Pasha |
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 664 మంది ఓటర్లు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధులు నిర్వర్తించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సామాగ్రిని అందించేందుకు నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను ఎంపిక చేయగా ఆదివారం ఎన్నికల సామాగ్రిని అందించనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ పోలీస్ అధికారులతో, ప్రిసైడింగ్, రూట్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు అందించి అవగాహన కల్పించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికే తపస్, పీఆర్టీయూ తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లాలో ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

కలెక్టర్ నేతృత్వంలో జిల్లాలో మొదటిసారి ఎన్నికలు

నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కోయ శ్రీ హర్ష జిల్లాలో మొదటిసారి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లు పూర్తిచేసేలా కలెక్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును విధులు నిర్వర్తించనున్నారు.

పేట జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఇవే

నారాయణపేట, ఊట్కూరు, దామరగిద్ద మండలాల 345 ఓటర్లకు కలిపి నారాయణపేట గవర్నమెంట్ గ్రౌండ్ హై స్కూల్లో అలాగే మరికల్, నర్వ, ధన్వాడ మండలాల 53 మంది ఓటర్లకు మరికల్ జెడ్పిహెచ్ ఎస్ లో ఏర్పాటు చేశారు. మాగనూరు, మక్తల్, కృష్ణ మండలాల 135 మంది ఓటర్లకు మక్తల్ జెడ్పిహెచ్ ఎస్ లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా కోస్గి మండల 88 ఓటర్లకు( ప్రభుత్వ జూనియర్ కళాశాల), మద్దూర్ మండల 43 మంది ఓటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story