యువకులకు గుండు గీయించిన పోలీసులు..? అవమాన భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం..

by Sumithra |   ( Updated:2024-10-19 08:00:40.0  )
యువకులకు గుండు గీయించిన పోలీసులు..? అవమాన భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం..
X

దిశ, అచ్చంపేట : శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలకు విఘాతం కలిగితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టి నిందితులను చట్టపరంగా శిక్షించాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా నాగర్ కర్నూలు జిల్లా లింగాల పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ముగ్గురు యువకులకు గుండు గీయించడంతో వారిలో ఒకరు మనస్థాపానికి గురై శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆ బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు మత్తు పదార్థాలను సేవించి మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్దకు దసరా పండుగ రోజు వెళ్లారని, బంకులో పనిచేస్తున్న వారితో ఘర్షణకు దిగారని సమాచారం. బంకు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మత్తులో ఉన్న ఆ యువకులు పోలీసుల ముందుకూడా అతి ఉత్సాహం చూపిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని.. దాంతో పోలీసులు కోపోద్రుక్తులై స్టేషన్ ఆవరణలోనే గుండు గీయించినట్లు గ్రామస్తులు తెలిపారు.

అవమానభారంతో ఆ ముగ్గురి యువకులలో ఒకరిని తల్లిదండ్రులు మందలించడం, గుండు గీయించారన్న అవమానంతో ఆ బాధితుడు శుక్రవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. అలాగే పోలీసులు గుండు గీయించారన్న విషయం బయటకు చెబితే బాగుండదని తదుపరి పరిణామాలు వేరేలా ఉంటాయని కుటుంబ సభ్యులను సైతం పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన పై దిశ శనివారం లింగాల ఏఎస్ఐ శ్రీనివాసులను వివరణ కోరగా ప్రస్తుతం ఎస్సై ప్రత్యేక శిక్షణలో ఉన్నాడని, ఆ సంఘటనకు సంబంధించి తమకేమీ తెలియదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed