- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీలో లుకలుకలు
దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుక్కుతుక్కుగా మారుతుంది. గతంలో పార్టీ అత్యంత బలంగా ఉండేది. పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసీసీ సభ్యుడు మాజీ శాసన మండల సభ్యుడు కే ప్రేమ్ సాగర్ రావు ఆదిపత్యంతో పార్టీలోని మరో వర్గం క్రమంగా కాంగ్రెస్‌కు దూరం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను పట్టించుకోకుండా పార్టీలో తన సన్నిహిత వ్యక్తులను తెరపైకి తెస్తుండడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రోజుకో నియోజకవర్గంలో అసమ్మతి నేతలు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా తూర్పు జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ రెండుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఏకం చేస్తూ ఆయన ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు పార్టీలో వర్గ పోరు సీరియస్‌గా నడుస్తోంది.
మంచిర్యాల నియోజకవర్గంలోనూ..
తూర్పు జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో శాసనమండలి మాజీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావును వ్యతిరేకిస్తూ మరో వర్గం బలంగా అధిష్టానం దృష్టికి వెళుతోంది. పార్టీ సీనియర్ నేతలు కేవీ ప్రతాప్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, లక్షెట్టిపేట జెడ్పీటీసీ సభ్యుడు సత్తయ్య తదితరులు ఆ నియోజకవర్గంలోని సుమారు 100 మంది ముఖ్యనేతలతో ఇటీవల ఒక రైస్ మిల్లులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పీసీసీ అధికార ప్రతినిధి గోమాస శ్రీనివాసులును సమావేశానికి ఆహ్వానించారు. అక్కడే పార్టీలో ఏకపక్ష విధానాన్ని నిరసిస్తూ తామంతా ఏకతాటిపై నడవాలని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆయన సతీమణి డీసీసీ అధ్యక్షురాలు కే. సురేఖ ఇద్దరే నియోజకవర్గంలో పాటు తూర్పు జిల్లాలో ఆధిపత్యం వహిస్తున్నారని దీన్ని నిరసిస్తూ అధిష్టానం వద్దకు వెళ్లాలని ఆ సమావేశంలో నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను ఏకం చేసేందుకు ఆ సమావేశం నిర్ణయించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమని ఈ సమావేశంలో నేతలు తెలిపినట్లు సమాచారం.
బెల్లంపల్లి, చెన్నూర్ ఇలా..
ప్రేమ్ సాగర్ రావును వ్యతిరేకిస్తూ బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు పార్టీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదన్న కారణంతో బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్జల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరామ్, మాజీ కౌన్సిలర్ బైరి శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. భవిష్యత్తులో వీరంతా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలిసింది.
ఇక్కడ పార్టీ సీనియర్ నేత సూరిబాబు కూడా పార్టీ వైఖరిపై కొంత ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు చెన్నూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆయనను ప్రేమ్‌సాగర్‌రావు పట్టించుకోకుండా దూరం ఉంచుతున్నారని టాక్. దీంతో ఆయన నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా రమేష్ అనే నేతను తెరపైకి తేవడాన్ని జనార్ధన్ నిరసిస్తున్నట్లు సమాచారం. ఇలా తూర్పు జిల్లాలో పార్టీ రెండుగా చీలిపోతోందని తెలుస్తోంది
ఆయనే పెద్దదిక్కు...
అయితే కాంగ్రెస్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో తూర్పు జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ కష్ట కాలంలోనూ ప్రేమ్ సాగర్ పార్టీకి అండగా నిలబడ్డారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూర్పు జిల్లాలో వర్గాలు మొదలైనట్లు చెబుతున్నారు. అయితే తన ప్రాతినిధ్యాన్ని తక్కువ చేస్తే పార్టీని వీడుతానని ప్రేమ్ సాగర్ రావు అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.