Tummala: రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభం ఆరోజే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Prasad Jukanti |
Tummala: రూ.2 లక్షల రుణమాఫీ ప్రారంభం ఆరోజే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రైతు రుణమాఫీపై దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని, మూడు విడతల్లో చేస్తున్నామని ఇప్పటివరకు రెండు విడతలల్లో రూ. లక్షన్నర వరకు మాఫీ చేశామని తెలిపారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15న రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు సీతారామ ప్రాజెక్టును సైతం సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లను సవరించి అర్హులైన వారందరికీ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ప్రక్రియ సాగుతుండగానే బురద జల్లుడా?

రుణమాఫీ కావడం లేదంటూ రైతుల వివరాలు సేకరిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా మధ్యలో ఉండగానే మాఫీ కాలేదని ప్రభుత్వంపై బురదజల్లడం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. తాము నిర్ణయించిన కటాఫ్ తేదీలలో ఉన్న రుణాల మాఫీ కార్యక్రమం కొనసాగుతున్నదని, మీ హయాంలో కాని రుణమాఫీ వివరాలు సేకరించి వాటిని క్లియర్ చేయాలని ఆ ప్రబుద్ధులకు సూచిస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని, ఓఆర్ఆర్‌ను అప్పనంగా రూ. 7 వేల కోట్లకు అమ్మి సరిగ్గా ఎన్నికలకు ముందు రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని భట్టి విమర్శించారు. మీ చిల్లర మాటలతో రైతుల మనోధైర్యం దెబ్బతీయవద్దని సూచించారు. రైతు భరోసా, పంటల బీమా పథకాలను అమలు చేస్తామన్నారు. ఇన్సూరెన్స్ పథకం టెండర్ స్టేజీలో ఉందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా రైతు భరోసాపై అభిప్రాయాల సేకరణ పూర్తి కాలేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed