రుణమాఫీకి కసరత్తు స్టార్ట్.. సర్కారు ముందున్న మూడు ఆప్షన్లు ఇవే..!

by Rajesh |
రుణమాఫీకి కసరత్తు స్టార్ట్.. సర్కారు ముందున్న మూడు ఆప్షన్లు ఇవే..!
X

రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నది. నిధుల సమీకరణకు మూడు దారులను ఎంచుకొని సాధ్యా సాధ్యాలపై కసరత్తు చేస్తున్నది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ట్రాన్స్‌ఫర్ చేయాలనే ఆలోచనలో ఉన్నది. దీనికి గాను హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంకును సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసి, ఆ భూమిని అభివృద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నది. మరో వైపు రుణమాఫీకి సుమారు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని లాంగ్ టర్మ్ రుణంగా తీసుకొని 25 ఏండ్ల పాటు వాయిదాలు చెల్లించాలని అనుకుంటున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నది. ఇందులో భాగంగానే రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు షురూ చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ ఆఫీసర్లతో సంప్రదింపులు స్టార్ట్ చేసింది. రైతులు తీసుకున్న రుణాలను కార్పొరేషన్‌కు బదిలీ చేయొచ్చా ? ఒక వేళ చేస్తే ఎలా తీర్చుతుంది ? సంస్థకు ఆదాయ మార్గాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆర్‌బీఐ అధికారులు ఇచ్చిన సలహాలను బేస్ చేసుకొని ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తున్నది.

రుణాల ట్రాన్స్‌ఫర్‌కు ఆర్‌బీఐ అనుమతి మస్ట్

రైతులు తీసుకున్న రుణాలు కార్పొరేషన్‌కు బదలాయించి, ఆ అప్పును ప్రతి నెల వాయిదా రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. అయితే కార్పొరేషన్‌కు రుణాలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఆర్‌బీఐ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాల్సి ఉన్నది. అందుకు ముందస్తుగా ప్రభుత్వం ఆర్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నది. ఒక వేళ ఆర్‌బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రుణాలు చెల్లించేందుకు కార్పొరేషన్‌కు ఉన్న ఆదాయ మార్గాలేంటనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా వాయిదాలు చెల్లించే శక్తి కార్పొరేషన్‌కు ఉన్నదని ఆర్‌బీఐ సంతృప్తి చెందకపోతే రుణ బదలాయింపు కష్టమని వారు పేర్కొ్ంటున్నారు.

భూముల అమ్మకమే ప్రధాన వనరు!

ప్రతి నెల వాయిదాలు చెల్లించేందుకు కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయ మార్గాలు చూపించాలనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. ముందుగా లిక్కర్ అమ్మకాలు, వెహికల్, ఆస్తుల రిజిస్ట్రేషన్, టోల్‌టాక్స్ పై సెస్ విధించి కార్పొరేషన్ ఆదాయంగా చూపిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ సెస్ విధిస్తే పొలిటికల్‌గా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు సమాచారం. రాజధాని చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంకును సంస్థకు ట్రాన్స్‌ఫర్ చేసి, ఆ భూమిని అభివృద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నది. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో సంస్థకు బదాలియించిన అప్పులు తీర్చాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.

అప్పు చెల్లింపునకు 25 ఏండ్లు?

రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మొత్తాన్ని లాంగ్ టర్మ్ రుణంగా తీసుకుని 25 ఏండ్ల పాటు వాయిదాలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఆ విధంగా చేయడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed