రుణమాఫీ ఎఫెక్ట్.. కాంట్రాక్టర్లకు నో బిల్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-12 04:53:36.0  )
రుణమాఫీ ఎఫెక్ట్.. కాంట్రాక్టర్లకు నో బిల్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆగస్టు మాసం నుంచి ప్రభుత్వానికి నిధుల కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. మళ్లీ ఎన్నికలు వస్తుండడంతో గతంలో ఇచ్చిన రూ. లక్ష లోపు రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం పై రూ. 19 వేల కోట్ల అదనపు భారం పడింది. ఫలితంగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దీంతో ‘రుణమాఫీ పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వొద్దు’ అని ప్రగతిభవన్ నుంచి మౌఖిక ఆదేశాలు అధికారులకు వచ్చినట్టు తెలిసింది.

ఎలక్షన్ టైమ్‌లో ఎమ్మెల్యేలకు టెన్షన్..

మొన్నటివరకు కాంట్రాక్టు పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్లే బాధితులుగా కనిపించేవారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చక్కర్లు కొడుతున్నారు. బిల్లులు చెల్లించాలని ప్రగతిభవన్ వర్గాలను వేడుకుంటున్నారు. వివిధ పనుల కోసం మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు వెళ్లిన సమయంలో బిల్లుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా.. బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు అవసరమవుతాయని, వెంటనే బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

కేటీఆర్, హరీశ్ చుట్టూ ప్రదక్షిణలు

చేసిన పనులకు బిల్లుల చెల్లింపు లేట్ అవుతుండటంతో మంత్రులు కేటీఆర్, హరీశ్ లపై ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ముందు బిల్లులు ఆలస్యమైతే ఖర్చులకు ఇబ్బంది అవుతుందని తమ సమస్యను వివరిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణమాఫీ, రైతుబంధు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చుకావడంతో, బిల్లుల చెల్లింపు కాస్త ఆలస్యం అవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. అయితే బిల్లుల ఆలస్యంపై కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘బిల్లుల చెల్లించాలని సీఎం కేసీఆర్ చెబితేనే పని అవుతుంది. ప్రతి పనికోసం ఆయన దగ్గరకు వెళ్లడం కష్టంగా ఉంది.’ అని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన చెందారు. అయితే ఎమ్మెల్యేలకే బిల్లుల చెల్లింపు లేట్ అయితే సాధారణ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చని కామెంట్ చేశారు.

బినామీల పేర్లతో పనులు!

బీఆర్ఎస్ లోని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. కొందరు నేరుగా తమ బంధువుల పేరుతో సంస్థలను ఏర్పాటు చేసి కాంట్రాక్టు పనులు దక్కించుకోగా, ఇంకొందరు మాత్రం చాలా ఏళ్లుగా కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలను నయానోభయానో దారిలోకి తెచ్చుకుని ప్రభుత్వ పనుల్లో వాటాదారులుగా చేరినట్టు విమర్శలు ఉన్నాయి. అయితే ఇంతకాలం వారు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బంది రాలేదు. కానీ ఈ మధ్య రుణమాఫీ, రైతుబంధు కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరముండడంతో ఎమ్మెల్యేల బినామి సంస్థలకు బిల్లుల చెల్లింపు నిలిపి వేసినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story