Dharani Portal: రూ.60 వేల కోట్ల అవినీతి.. ఎంక్వయిరీ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు లేఖ

by Gantepaka Srikanth |
Dharani Portal: రూ.60 వేల కోట్ల అవినీతి.. ఎంక్వయిరీ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌(Dharani Portal)ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఎజెన్సీలకు కట్టబెట్టడం వల్ల రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ యూనియన్ ఆరోపించింది. భారతీయ న్యాయ సంహిత(Indian Law Code) సెక్షన్ 256 ప్రకారం ప్రభుత్వ భూములను సంరక్షించాలని, అక్రమార్కుల నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సంఘం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ(Central Vigilance Commissioner Praveen Kumar Srivastava)ను కోరారు. అక్రమాలకు పాల్పడిన బ్యూరోక్రాట్లను శిక్షించాలని లేఖ రాశారు. 2020 నవంబరు నుంచి ఈ రెండు జిల్లాల్లో అనేక అవకతవకలు జరిగాయని సంఘం నాయకులు వివరించారు. హెచ్ఎండీఏ కోకాపేటలో ల్యాండ్ ని ఆక్షన్ వేస్తే ఎకరం రూ.100 కోట్లు పలికిందని గుర్తు చేశారు. అందుకే ఈ అక్రమాల విలువ రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఈ ప్రాపర్టీస్‌తో లాభం ఉంటుందన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేసిన అధికారులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు కొన్ని భూముల వివరాలను కూడా లేఖలో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నం.63లో 42 ఎకరాలు, గోపన్ పల్లిలో సర్వే నం.124/10లో 50 ఎకరాలు, సర్వే నం.36, 37లో 600 ఎకరాలు, హఫీజ్ పేట సర్వే నం.80లో 20 ఎకరాలు, శంకర్ పల్లి మండలం మోకిల సర్వే నం.555(కొత్తది)లో 150 ఎకరాలు, మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలం శంషీగూడ సర్వే నం.57 లో 92 ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ మేరకు సంఘం నాయకులు సురేష్ పొద్దార్, వి.బాలరాజు, ఎ.రవీందర్ రెడ్డి, బి.మధుసూదన్, కె.విష్ణువర్ధన్ రెడ్డి, కె.లక్ష్మయ్య, పి.నారాయణ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed