Bandi Sanjay : అభివృద్ధిలో కలిసి సాగుదాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : అభివృద్ధిలో కలిసి సాగుదాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాలు(Politics) ఎన్నికల వరకేనని ఆ తరువాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి(development)చేసుకుందాం..ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ) కోరారు. చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రంలో బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి రూ.25 కోట్ల వ్యయంతో మల్యాల చౌరస్తా నుండి కాచారం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చాలా రోజుల తరువాత ప్రోటోకాల్ ను పాటించడం కన్పించిందని, ఇది మంచి వాతావరణమన్నారు. అధికారులు కూడా ఆనందంగా ఉన్నారని, గతంలో ఎట్లుందో మీరు చూశారని, గత బీఆర్ఎస్ పాలనలో ప్రోటోకాల్ పాటించలేదని, నిబంధనలను ఉల్లంఘించడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కమీషన్లకే పరిమితమై నిబంధనల మేరకు పనులు చేయలేదని, అధికారులను కూడా పని చేయకుండా ఒత్తిడి తెచ్చారన్నారు. పేరు ప్రఖ్యాతులకే బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చిందని, కమీషన్లు దండుకున్నారని, గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదని, కార్యకర్తలు కొట్టుకోవడం, గొడవలు పడటం తప్ప అని హితవు పలికారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రోటోకాల్ పాటించలేదని, కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. కమీషన్లు, పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యమిచ్చిందే తప్ప నిబంధనల ప్రకారం పనిచేయలేదని, అధికారులను కూడా పనిచేసుకోనివ్వలేదని ఆరోపించారు.అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలన్నదే మా అభిమతమని, ఈసారి కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగమయ్యేలా ఈరోజు మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులను మల్యాల నుండి కాచారం వరకు డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల విషయంలో సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అభినందనలు తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీకి, నితిన్ గడ్కారీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గడ్కరీ అత్యధిక నిధులు మంజూరు చేశారని, తెలంగాణ రాష్ట్రానికి మోదీ హయాంలో అత్యధిక సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed