HYD: ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం.. హైకోర్టుకు చేరిన ఇష్యూ

by Gantepaka Srikanth |
HYD: ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం.. హైకోర్టుకు చేరిన ఇష్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో జరిగే గణేశ్ నిమజ్జనంపై న్యాయవాది మామిడి వేణుమాధవ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మినహా మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి గతంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని, కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాలని తన పిటిషన్‌లో మామిడి వేణుమాధవ్ హైకోర్టును కోరారు. మూడేండ్ల క్రితం సైతం ఇదే తరహాలో తాను పిటిషన్ దాఖలు చేశానని, అప్పటి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారని తాజా పిటిషన్‌లో గుర్తుచేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన, సింథటిక్ రంగులు వాడిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందువల్ల కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి చర్యలు తీసుకోవాలని తాజా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌ను విచారించడానికి రిజిస్ట్రీ నంబరింగ్ ఇవ్వకపోవడంతో చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. పండుగ దగ్గర పడుతున్న సమయంలో హైకోర్టును ఆశ్రయించడం సమంజసం కాదని, న్యాయమూర్తుల మీద ఒత్తిడి పెరుగుతుందని, సంవత్సర కాలంగా ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, గతేడాది హైకోర్టు ఇచ్చిన లిబర్టీతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం తర్వాతి కాలుష్యం వివరాలను కోర్టుకు నివేదిక రూపంలో సమర్పించానని, రెండేండ్ల క్రితం నాటి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరిగి ఓపెన్ చేసి విచారించడానికి హైకోర్టు అప్పుడే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. అప్పటి నుంచీ ఈ పిటిషన్ విచారణ దశలోనే ఉన్నదని, కానీ ఇటీవల నిమజ్జనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అదనంగా జోడించానని బెంచ్‌కు వివరించారు.

పిటిషనర్ వాదనతో ఏకీభవించిన బెంచ్... ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశంగా ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని, గణేశ్ నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్‌లో తలెత్తే కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను ఈ నెల 9న చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ప్రతి ఏటా నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ కాలుష్యానికి సంబంధించి పాత పిటిషన్ల విచారణ అనంతరం ప్రభుత్వానికి జారీచేసిన నోటీసులు, ఇచ్చిన ఆదేశాలు, వాటి అమలు, చోటుచేసుకున్న నిర్లక్ష్యం తదితరాలపై వాదనలు జరుగుతూనే ఉన్నాయని పిటిషనర్ గుర్తుచేశారు. ఏ విగ్రహం ఏ మెటీరియల్‌తో తయారైందో గణేశ్ మండపాల దగ్గర స్పష్టమైన డిస్‌ప్లే బోర్టును పెట్టాల్సిందిగా గతంలో హైకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చినా అమలు కావడంలేదని, ప్రభుత్వం యంత్రాంగం సైతం సీరియస్‌గా పరిగణించడంలేదని పిటిషనర్ వివరించారు. తదుపరి విచారణ అనంతరం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed