Delhi Liquor Scam : ఎన్‌ఫోర్స్ మెంట్ చేతికి కీలక ఆధారాలు?.. అందులో తెలంగాణ నేతల లిస్ట్

by S Gopi |   ( Updated:2022-11-17 03:47:44.0  )
Delhi Liquor Scam : ఎన్‌ఫోర్స్ మెంట్ చేతికి కీలక ఆధారాలు?.. అందులో తెలంగాణ నేతల లిస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముడుపులను చార్టర్డ్ ఫ్లయిట్‌లలో తీసుకెళ్లారా? తెలంగాణ నేతలు కీలక పాత్ర పోషించారా? ఇందుకు జెట్ సెట్ గో అనే ఏవియేషన్ సంస్థ సహకరించిందా? ఈ వ్యవహారంలో అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ కనికారెడ్డి కీలక భూమిక పోషించారా? వంటి విషయాల్లో ఈడీకి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తున్నది. జెట్ సెట్ గో పై దృష్టి పెట్టిన ఎన్‌ఫోర్స్ మెంట్ చేతికి కీలక సమాచారం చిక్కినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫ్లయిట్‌లలో ట్రావెల్ చేసిన రాష్ట్ర ప్రముఖుల జాబితా కూడా వారి వద్ద ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈడీ చేతికి వివరాలు..

లిక్కర్ స్కామ్‌తో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్త గత నెల 17న ఎయిర్ పోర్ట్ అథారిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. జెట్ సెట్ గో ఏవియేషన్ నిర్వాహకుల వివరాలు, కంపెనీ పెట్టినప్పటి నుంచి అది నడిపిన చార్టర్డ్ విమాన సర్వీసులు, అందులో ప్రయాణించినవారి వివరాలను అందజేయాలని కోరారు. ఈ వివరాలన్నీ గత నెల చివరి వారంలోనే ఈడీకి అందినట్లు తెలిసింది.

బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని అనుమానించిన సీబీఐ మనీ లాండరింగ్ కోణం నుంచి సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా ఈడీ సాయాన్ని కోరింది. పలు కంపెనీల నుంచి ఇతర కంపెనీలు, వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనికి తోడు బేగంపేట విమానాశ్రయం నుంచి నగదు రూపంలో చార్టర్డ్ విమానాల ద్వారా నగదు ఢిల్లీకి చేరుకున్నట్లు ఈడీ అధికారులకు అనుమానం కలిగింది. బేగంపేట కేంద్రంగా ఆరు చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న జెట్ సెట్ గో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న కనికారెడ్డి (కనికా టేక్రీవాల్) సీఈఓగానూ వ్యవహరిస్తున్నారని తేలింది. శరత్ చంద్రారెడ్డి, కనికారెడ్డి భార్యాభర్తలు.

బేగంపేట నుంచి ఢిల్లీకి ప్రైవేటు చార్టర్డ్ విమానాల ద్వారా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయిందని, దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదని ఈడీ బలంగా అనుమానిస్తున్నది. ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి పూర్తి వివరాలు లభ్యం కావడంతో బేగంపేట నుంచి చార్టర్డ్ విమానాలు ఎప్పుడెప్పుడు ఎన్ని ఢిల్లీకి వెళ్లాయి, వాటిని ఎవరు బుక్ చేశారు, అందులో ఎవరెవరు ప్రయాణించారు తదితర వివరాలన్నీ ఈడీ చేతికి చిక్కాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అందిన వివరాల్లో జెట్ సెట్ గో సంస్థకు సంబంధించిన సమస్త ఆపరేషన్ డీటెయిల్స్ ఉన్నట్లు ఈడీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. అరబిందో ఫార్మా శరత్‌ చంద్రారెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు కనికారెడ్డి ద్వారా ఎలాంటి అదనపు వివరాలు రాబడతారన్నది కీలకంగా మారింది.

జెట్ సెట్ గో ఏవియేషన్ సంస్థ నడిపిన చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించినవారి వివరాల ఆధారంగా అవసరమైతే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్పెషల్ ఫ్లయిట్ లను బుక్ చేసుకున్న వీఐపీలు, వారి అవసరాలు, వ్యాపార లావాదేవీలు, రాజకీయ సంబంధాలు తదితరాలన్నింటిపై ఈడీ ఆరా తీస్తున్నది. లిక్కర్ స్కామ్‌తో లింకులున్నవారితో కనికారెడ్డికి ఎలాంటి ఆర్థిక సంబంధాలున్నాయనే వివరాలను కూడా వెలికి తీసే పనిలో ఈడీ నిమగ్నమైంది. ఇప్పటికే ఈడీ దగ్గర చార్టర్డ్ ఫ్లైట్స్ వాడిన, ప్రయాణించినవారి జాబితా ఉన్నందున రానున్న కాలంలో లిక్కర్ స్కామ్ దర్యాప్తు మరింత ముమ్మరం కానున్నది. మరికొన్ని సోదాలు, కొత్త వ్యక్తుల అరెస్టు కూడా జరగొచ్చన్న లీకులు ఢిల్లీ నుంచి వెలువడుతున్నాయి.

బేగంపేట ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తుండడంతో వీఐపీల వాహనాలు నేరుగా రన్‌వే పైకి వెళ్లే వీలున్నది. లిక్కర్ స్కామ్‌లో ముడుపులు ముట్టినట్లు నగదు చేతులు మారినట్లు వస్తున్న ఆరోపణలకు ఈడీ ఇప్పుడు బేగంపేట చార్టర్డ్ విమానాలతో లింకు పెట్టి పరిశీలించనున్నది. పొలిటికల్ లీడర్ల పేర్లు ఏవీ బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులున్నందున దర్యాప్తు ఇక రెండు రాష్ట్రాలకూ లోతుగా పాకనున్నది.

ఇవి కూడా చదవండి : లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరోరా.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ టెన్షన్!

Advertisement

Next Story

Most Viewed