బీఆర్ఎస్ నేతల భూభాగోతం! అరాచకాలు సృష్టిస్తున్న లేడీ డాన్?

by Ramesh N |   ( Updated:2024-02-08 12:46:48.0  )
బీఆర్ఎస్ నేతల భూభాగోతం! అరాచకాలు సృష్టిస్తున్న లేడీ డాన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై హైదరాబాదులో అరాచకాలు సృష్టిస్తున్న లేడీ డాన్ రమా జ్యోతిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ధరణి బాధితుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోరళ్ల కృష్ణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బిలీఫ్ హాస్పిటల్ ఎండీ రమాజ్యోతి అరాచకాలు రోజు రోజుకు నగరంలో ఎక్కువైతున్నాయని ఆరోపించారు. పహాడీషరీఫ్ ఎస్సై మధుసూదన్ అండదండలతో మహేశ్వరం ఏరియాలలో భూ దందాలు చేస్తూ అడ్డు వచ్చిన వారిపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తనపై తాజాగా భౌతికంగా దాడికి ఆమె ప్రయత్నం చేశారని తెలిపారు.

కిరాయి గుండాలను తన వెంటబెట్టుకుని వచ్చి తనతో పాటు సమీప బంధువుపై కత్తులు వేట కొడవళ్ళతో దాడి చేసి హత్య యత్నానికి పాల్పడ్డ రమా జ్యోతి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు అంటూ అధికారులను బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి పువ్వాడ స్పందించాలని రమా జ్యోతితో వారికి ఉన్న సంబంధాలను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల భూభాగోతం!

గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ధరణి, అలాగే బీఆర్ఎస్ రియల్ మాఫియా బాధితుడిని అని తెలిపారు. తనకు మహేశ్వరం మండలం కొంగర కుర్దు గ్రామ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల 24 గుంటల భూమిని కొనుగోలు చేశానని స్పష్టంచేశారు. ఆ భూమిని తన కుటుంబ సభ్యుల పేర రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు. తనకు అమ్మిన భూమిని ఇతరులకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. దానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ అమయ్, ఎఆర్ఓ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దాని పక్కన 285 సర్వే నెంబర్లో తాండ్ర మోహన్ రావు దగ్గర 3 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని, సదరు భూమిని మాజీ ఎంఎల్‌సీ శేరి శుభాష్ రెడ్డి వియ్యంకుడి పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై ఎంఎల్‌సీ దృష్టికి తీసుకవెళ్తే దిక్కున్న చోట చెప్పుకోండని సమాధానం ఇచ్చారని తెలిపారు. సూర్యాపేట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణతో కుమ్మక్కు అయ్యి కబ్జా యత్నం చేస్తున్నారు. దీని వెనుక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందని, ధరణిలో లోటుపాట్లను ఆసరాగా చేసుకుని భూముల కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ఆదిబట్ల పీఎస్‌లో కేసు పెట్టిన పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒక ఛానల్ ప్రతినిధి రికార్డ్ చేశారని, పహాడీషరీఫ్ ఎస్ఐ దానిని డిలీట్ చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని, తనకు ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed