KTR: ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రేవంత్ అనర్హుడు

by Gantepaka Srikanth |
KTR: ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రేవంత్ అనర్హుడు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాలో మాట్లాడారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం అన్నారు. ఈ అవమానం కేవలం సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి మాత్రమే జరుగలేదని.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం అవమానించేలా మాట్లాడారని అన్నారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు.. కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు సీఎంకు తప్పకుండా తగులుతుందని అన్నారు.

‘‘మా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి గెలిచిన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారు. ఆ విషయం సీఎం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉప ముఖ్యమంత్రి అనడం కూడా అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు భట్టి గారు. పదేళ్లు అధికారంలో ఉన్నాం. ఏ రోజైనా ఆడబిడ్డలను అవమానించామా? ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడామా? అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం. ఈరోజు మా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం దేశం మొత్తం చూసింది. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రేవంత్ రెడ్డి అనర్హుడు’’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed