కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

by Satheesh |   ( Updated:2023-03-15 14:59:31.0  )
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 35వేల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అక్రమం అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తొలగించిన వారి పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓట్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. 75ఏళ్లుగా శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా ఓట్లను తొలగించడం అన్యాయమన్నారు.

ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై మండిపడ్డారు. గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కానీ ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35 వేలమంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed