- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delimitation: బీఆర్ఎస్ నేత KTR కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: డీలిమిటేషన్(Delimitation)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కీలక ప్రకటన చేశారు. శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది భవిష్యత్తుకు పెను ప్రమాదం ఉందని అన్నారు. దశాబ్దాల నుంచి దక్షిణాదిపై వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. ఈ విధానం కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, నిధుల కేంద్రీకరణతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని, దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. భారతదేశం ప్రజాస్వామిక దేశమైనప్పటికీ, భిన్న అస్తిత్వాలు, సంస్కృతులతో కూడిన సమాఖ్య రాష్ట్రమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి దశాబ్దాలుగా వివక్షను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత డీలిమిటేషన్ ప్రతిపాదనలతో పార్లమెంట్ ప్రాతినిధ్యంతో పాటు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం(NDA Govt) ప్రజల ప్రాతినిధ్యాన్ని, ప్రభుత్వాలతో సంబంధాలను పెంపొందించి మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేపడుతున్నట్లయితే, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ఈ విధానానికి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి తరఫున కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ఆధారంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచితే పరిపాలన ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని, అందుకే పార్లమెంట్ స్థానాలను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని ఆయన సూచించారు. లేదంటే, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం లేదా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సీట్ల విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, అయితే మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ అన్యాయం మరింత పెరిగిందన్నారు కేటీఆర్. ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం మరొక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. ఈ సమస్య కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని, జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన డీలిమిటేషన్ హామీలను నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రయోజనాల కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయకపోగా, జమ్మూ కశ్మీర్‌లో మాత్రం అమలు చేసిందని విమర్శించారు. బీజేపీ వంటి పార్టీలు ఈ సమావేశాన్ని దేశ వ్యతిరేకంగా చూపే ప్రయత్నం చేసినా, "మేమంతా భారతీయులం, దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం," అని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సమావేశం తర్వాత ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల పార్టీలు, నేతలు కలిసి ప్రస్తుత డీలిమిటేషన్ విధానంపై పోరాటం చేస్తామని కీలక ప్రకటన చేశారు.