Kodad: అవమానం జరిగిందంటూ బోరున విలపించిన మున్సిపల్ చైర్ పర్సన్

by GSrikanth |   ( Updated:2022-08-15 11:24:32.0  )
Kodad Municipal Chairperson was Insulted on Independence Day celebrations
X

దిశ, కోదాడ: Kodad Municipal Chairperson was Insulted on Independence Day celebrations| మహిళా ప్రజాప్రతినిధిని అయిన తనను అవమానించారని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష కంటతడి పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం కోదాడ పట్టణంలోని గ్రంథాలయ కార్యాలయంలో జెండావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకొచ్చే క్రమంలో ''మా ఎమ్మెల్యే పక్కన నువ్వెలా ఉంటావ్'' అంటూ ఎమ్మెల్యే పక్కనున్న ఓ మహిళా ప్రజా ప్రతినిధి పక్కకు తోసేసిందని ఆరోపించారు. ఆమెతో పాటు చాలామంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని, మున్సిపల్ చైర్ పర్సన్‌ను అయిన తనకే ఇలా అవమానం జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేపట్టారు.

మున్సిపల్ కమిషనర్‌తో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ల వాదన

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జెండా వందన కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్‌తో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు వాదనకు దిగారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే జెండా ఎగరవేస్తామని కమిషనర్ చెప్పడంతో, సమయం చాలాసేపు అవుతుంది ఎమ్మెల్యే సమయానికి రాకపోతే ఎలా.. కార్యక్రమం కొనసాగించాలని కౌన్సిలర్లు కమిషనర్‌కు చెప్పారు. అయినప్పటికీ కమిషనర్ కార్యక్రమం ప్రారంభించకపోవడంతో కొంతమంది కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో వాదనకు దిగారు. ఈ క్రమంలో మాజీ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ.. 'మీకేం సంబంధం' అంటూ కమిషనర్ మండిపడ్డారు. దీంతో వాదన ముదిరింది. తమకు సంబంధం లేనప్పుడు తమనెందుకు కార్యక్రమానికి ఆహ్వానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత చేజారకముందే స్థానిక నాయకులు జోక్యం చేసుకొని సర్ది చెప్పి చైర్ పర్సన్‌తో జండా ఎగువేయించారు.

బోరున విలపించిన మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తనకు అవమానం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మీడియా ముందు బోరున విలపించారు. సోమవారం పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళ ప్రజా ప్రతినిధిగా, పట్టణ ప్రథమ పౌరురాలిగా గాంధీ పార్కులో జరిగే వేడుకలకు హాజరు కాగా.. కొబ్బరికాయలు కొట్టే విషయంలో మండల మహిళా ప్రజాప్రతినిధి చింత కవితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి ఇరువురు తనను నెట్టివేసి అవమాన పరచడం చాలా బాధాకరంగా ఉందన్నారు. తమను విధుల నిర్వహించుకోకుండా అధికార, అనధికార వ్యక్తులచే అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యే మా విధులను నిర్వహించకుండా ప్రతిసారీ అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. తమకు ఏమాత్రం విలువ లేకుండా చేస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తున్నారని రోధించారు.

మున్సిపాలిటీ పరిధిలో జరిగే అధికార, అనధికార కార్యక్రమాలన్నింటిలో మండల మహిళా ప్రజా ప్రతినిధికి జోక్యం కల్పిస్తూ పాలకవర్గంలో చీలికలు తెస్తూ అబసుపాలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో తమ ఫోటోలు వేయకుండా రాజకీయ దురుద్దేశంతో కించపరుస్తున్నారని ఆవేదన చెందారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన తనకు, తన భర్త తోడుగా వస్తుంటే తన భర్తను రానివ్వకుండా అడ్డుకోవడం చాలా బాధాకరం అన్నారు. భర్తగా భార్యకు తోడు రావడం తప్ప అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డిలు తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకొని మా విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలన్నారు. ''అన్నా.. మల్లన్నా.. ఒక సోదరిగా వేడుకుంటున్నాను. ఒక మహిళను అయిన తనపై కక్ష కట్టి, నా భర్తను అవమానిస్తూ.. మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి.'' అంటూ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను వేడుకున్నది. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు తీపిరిశెట్టి సుశీల రాజు, మదర్, స్వామి నాయక్, గుండపునేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అవ్వా... కళ్లు ఎట్లా కనిపిస్తున్నాయ్...? : హరీశ్ రావు

Advertisement

Next Story