దేశ ప్రధానిని వ్యతిరేకించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
దేశ ప్రధానిని వ్యతిరేకించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో భయంకరమైన ఆర్టికల్ 370 విధానాన్ని అవలంభించారని, దాన్ని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ విభేదించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని, భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి అని కొనియాడారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ పోరాటం చేశారన్నారు. అప్పుడు దేశానికి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉంటే జమ్మూ కశ్మీర్‌కి షేక్ అబ్దుల్లా ప్రధానిగా ఉండేవారన్నారు.

నాడు దేశంలో మూడు రంగులు జెండా ఉంటే జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక జెండా ఉండేదన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం ఉండేదిని, దానికి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ అధ్యక్షుడిగా పోరాటం చేసి, అరెస్టయి జైలులోనే మరణం పొందారన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసమే బీజేపీ పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. 75 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

ఇదిలాఉండగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి స్టేట్ ఆఫీస్‌లో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపాటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర సహ ఇన్ చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ రామారావు, ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed