తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రగతి శూన్యం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-02-15 11:10:22.0  )
తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రగతి శూన్యం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

ప్రజా కోర్టులో మూల్యం చెల్లించక తప్పదు

దిశ, వైరా: తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి శూన్యమని, కేవలం సీఎం కేసీఆర్ కు ఆయన నామస్మరణ జపం చేయించుకోవాలనే ధ్యాస తప్ప మరో ఆలోచన లేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైరాలోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం నిర్వహించిన పొంగులేటి వర్గీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిది ఏళ్ల లో ప్రజల కలలు సాకారం కాలేదన్నారు.

15 నెలలు గడుస్తున్నా ధరణి వెబ్ సైట్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కరోనా కష్టకాలంలో రైతుల రుణమాఫీ చేయలేదని, కానీ, రూ.వందల కోట్లతో సచివాలయం ఉండగానే మరో సచివాలయాన్ని నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్య, సాగునీటి రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మేకపోతు గాంభీర్యంతో ప్రభుత్వం నిజాలను నిజంగా ఒప్పుకోవటం లేదని ఎద్దేవా చేశారు.

పొంగులేటి తన ప్రసంగంలో ఆధ్యంతం ప్రభుత్వ పథకాల అమల్లో లోపాలను ఎత్తిచూపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 10శాతమైన ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్ట్ కు అనుసంధానమైన రోల్లపాడు ప్రాజెక్టు కోసం 2016 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.19 వేల కోట్ల రూపాయలు కాగా, గడిచిన ఏడేళ్లలో నాబార్డ్ నుంచి రూ.6కోట్ల రూపాయల పనులే చేశారని వివరించారు. విద్యుత్ కోతలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు.

వైరా నియోజకవర్గంతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా నియోజకవర్గ ఇన్ చార్జి బానోత్ విజయబాయి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పొంగులేటి అనుచరులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story