కేసీఆర్ పాలనలో రుణమాఫీ నుంచి అన్ని మోసాలే : వైఎస్ షర్మిల

by Sumithra |   ( Updated:2023-05-01 13:37:20.0  )
కేసీఆర్ పాలనలో రుణమాఫీ నుంచి అన్ని మోసాలే : వైఎస్ షర్మిల
X

దిశ, తిరుమలాయపాలెం : రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రంగానికి పదివేల కోట్లు, పదిహేను వేల కోట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తున్నాడే తప్ప, ఆ రుణాలతో ఏ ఒక్క రైతును ఆదుకోలేకపోయాడని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలోని తెట్టేలపాడు గ్రామంలో మొక్కజొన్న పంటలు నేలకొరగగా, తిమ్మక్కపేట గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని అప్పుడే రైతుకు గిట్టుబాటు ధరతోపాటు, అన్ని విధాలా న్యాయం జరుగుతుందని అన్నారు.

రాజన్న రాజ్యంలో రైతులకు పంట ఋణమాపి, నష్ట పరిహారం, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ అందిందని, బోరులు, డ్రిప్పులు ఏర్పాటు చేసుకున్న రైతులకు సైతం దిగువంతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వం హయాంలో సహాయం అందిందని వివరించారు. పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కేసీఆర్ రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం నేటికీ అందడం లేదని, రుణమాఫీ పథకం నుంచి అన్ని మోసాలే అని మండిపడ్డారు. ఏ ఒక్క పథకం సక్రమంగా రైతులకు అందడంలేదని విమర్శించారు. రైతులకు నష్టపరిహారం అందే వరకు కేసీఆర్ సర్కార్ తో కొట్లాడుతానని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త బాలాజీ, వాలూరి సత్యనారాయణ, పోలేపొంగు నరసింహారావు, పీఏ భరత్ రెడ్డి,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed