రసకందాయంగా వైరా మున్సిపాలిటీ రాజకీయం.. ఎట్టకేలకు మున్సిపాలిటిలో అడుగుపెట్టిన చైర్మన్

by Mahesh |
రసకందాయంగా వైరా మున్సిపాలిటీ రాజకీయం.. ఎట్టకేలకు మున్సిపాలిటిలో అడుగుపెట్టిన చైర్మన్
X

దిశ, వైరా :వైరా మున్సిపాలిటీ రాజకీయాలు మరింత రసకందాయంగా మారాయి. ఈ అనూహ్య రాజకీయాలతో "అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట" అన్న చందంగా మారింది వైరా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.మున్సిపాలిటీ రాజకీయంలో ఊహించని షాక్ తగలడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిర్వేదానికి గురవుతున్నాయి. గత 15 రోజుల నుంచి వైరాకు దూరంగా ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ సోమవారం సడన్ గా ప్రత్యక్షమయ్యారు.

పొంగులేటి వర్గీయులతో కలిసి సోమవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చిన చైర్మన్ జైపాల్ సుమారు రెండు గంటల పాటు తన సీటులోనే ఆసీనులయ్యారు. వైరా పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరుతూ సూతకాని జైపాల్ రాష్ట్ర హైకోర్టులో గత నెల 27వ తేదిన లంచ్ మోషన్ రిపిటిషన్ వేసిన విషయం పాఠకులకు విధితమే. దాంతో న్యాయమూర్తి రిపిటిషన్ ను విచారణకు స్వీకరించారు. ఈ రిపిటిషన్ వేసే ముందు రోజు గత నెల 26వ తేదీ నుంచి జైపాల్ వైరాకు దూరంగా ఉన్నారు. అయితే 15 రోజుల తర్వాత ఆయన వైరా మున్సిపాలిటీ కార్యాలయంలో తన సీటులో ఆసీనులు కావడం రాజకీయంగా చర్చ అయింది.

వైరా మునిసిపాలిటీలోని సోమవరం గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంకును 2022 డిసెంబర్ 12న కూల్చివేశారు. ట్యాంక్ కూల్చివేత పై ఫిబ్రవరి 22వ తేదీన 16 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 15న మునిసిపల్ ఇన్చార్జ్ కమిషనర్ బి. అనిత సోమవరంలోని ట్యాంకును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, దీనిపై విచారణ నిర్వహించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంక్‌ను కూల్చివేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు విచారణను మొదలుపెట్టారు . ట్యాంక్‌ను కూల్చివేసిన తర్వాత స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తిని, ట్యాంక్ కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 20 రోజుల క్రితం విచారణ చేశారు . ఈ ట్యాంక్ కూల్చివేత లో ప్రమేయం ఉన్న వారి పేర్లతో పాటు, వారికి ముట్టిన నగదు వివరాలను, సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని చైర్మన్ జైపాల్‌ను పోలీసులు గత నెలలో మౌకికంగా పలుసార్లు సమాచారం ఇచ్చారు. అయితే విచారణకు హాజరుకాని జైపాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పోలీసులు వేధిస్తున్నారని వారి నుంచి రక్షణ కల్పించాలని, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మున్సిపల్ చైర్మన్‌గా ప్రథమ పౌరుడిగా ఉన్న తనను ప్రజలకు ఎలాంటి సేవ చేయకుండా విచారణ పేరుతో వేధిస్తున్నారని, ట్యాంక్ కూల్చివేత ఫిర్యాదులో కానీ, నమోదైన కేసులో కానీ తన పేరు ఎక్కడా లేకపోయినప్పటికీ కొంతమందిని సాక్ష్యాల పేరిట పోలీస్ స్టేషన్‌కు పిలిచి వారిని బెదిరించి తన పై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించి తనకు న్యాయం చేయాలని ఆ రిట్‌లో న్యాయస్థానాన్ని కోరారని సమాచారం.

ఈ రిట్ వేసిన అనంతరం సోమవారం చైర్మన్ జైపాల్ తొలిసారిగా వైరా కి వచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు బొర్రా రాజశేఖర్‌తో పాటు ఇతర అనుచరులతో కలిసి కార్యాలయానికి వచ్చిన చైర్మన్ రెండు గంటల పాటు కార్యాలయంలోని తన సీటులో కూర్చున్నాడు. అనంతరం తన సొంత పనిపై ఖమ్మం వెళ్లారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన బీఆర్ఎస్ శ్రేణులు వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో పడ్డారు.

కోవిడ్ రావటం వల్ల వైరా కు దూరంగా ఉన్నా: చైర్మన్

తనకు కరోనా వైరస్ సోకడం వల్లే గత 15 రోజులుగా వైరా కు దూరంగా ఉన్నానని వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ దిశకు తెలిపారు. తనకు గత నెల 26వ తేదీన కరోనా వైరస్ సోకిందని చెప్పారు. దీంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నానని వివరించారు. అనంతరం హైదరాబాద్‌లోనే 15 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని స్పష్టం చేశారు. కోవిడ్ లక్షణాలు పూర్తిగా తొలగడంతో తాను కార్యాలయానికి వచ్చానని ఆయన వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story