ఇక్కడున్నవారంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు పాలకులు పరాయివారెందుకు : ఎమ్మెల్యే కందాళ

by Sridhar Babu |
ఇక్కడున్నవారంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు పాలకులు పరాయివారెందుకు : ఎమ్మెల్యే కందాళ
X

దిశ, కూసుమంచి : ఇక్కడున్నవారంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు పాలకులు పరాయివాళ్లేందుకు అని పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యాల గూడెం గ్రామం నుండి తాళ్ల చెరువు, ముత్యాల గూడెం తిమ్మక్క పేట గ్రామాలలో జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించి రోడ్డు నాణ్యత ప్రామాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రానున్న కాలంలో ముత్యాల గూడెం తో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ...నా అభిమతం నా ఆశయం ఈ ప్రాంత వాసిగా ప్రజలకు కొంతైనా చెయ్యాలనేదే అన్నారు.

ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాకు చాలా ఉంది కానీ సేవ చేయాలనేదే నా అభిమతమని, అందుకే నేను, నా సతీమణి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతి, మత, కుల లింగ వర్గ విభేదం తేడా లేకుండా, పార్టీలకు అతీతంగా వెళ్తూ ప్రతి గడపను తడుతూ ప్రజలకు సేవ చేస్తున్నామని అన్నారు. మట్టికైనా ఇంట్లో వాడు కావాలి అని సామెత ఉంది కదా అని, ఈ ఊరికి ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్లు వస్తున్నారు వాళ్లతో జాగ్రత్త అని అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్లంతా ఈ ప్రాంత బిడ్డలైనప్పుడు నాయకులు పరాయి వాళ్లు కావాలా పరిపాలించడం మనకు చేతకాదా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంట కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, ఎంపీటీసీ ఉడుగు జ్యోతి వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మల్లిడి వెంకన్న, చాగంటి శ్రీను, బొల్లికొండ సత్యం,పేరెల్లి ఉపేందర్ చారి , బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed