తప్పు ఎవరిది ?

by Disha Web Desk 15 |
తప్పు ఎవరిది ?
X

దిశ, ఖమ్మం : అధికారుల నిర్లక్ష్యంతో ఓ లైన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని తల్లాడ సబ్ డివిజన్లో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో సబ్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మాటి కంట్రోల్ ఉన్న ప్రొడక్షన్ ఏడీఈ కిరణ్ ఆదివారం తల్లాడ సబ్ స్టేషన్ లో సిటీ ట్రాన్స్​ఫార్మర్​ నేమ్ ప్లేట్ తనిఖీల్లో భాగంగా వచ్చారు. అక్కడ లైన్మెన్ లింగాచారి సహాయంతో నేమ్ ప్లేట్ తనిఖీ చేసేందుకు సబ్ స్టేషన్ లోపలికి వెళ్లారు. అయితే సబ్ స్టేషన్ లోపలికి వెళ్లే సమయంలో ఎల్సీ తీసుకొని వెళ్లాలి.

ఏడీఈ అలా చేయకుండా వెళ్లారు. సిటీ ట్రాన్స్​ఫార్మర్​ నేమ్ ప్లేట్ సరిగ్గా కనిపించకపోవడంతో ప్రొడక్షన్ ఏడీఈ సూచనల మేరకు లైన్మెన్ లింగాచారి కుర్చీ వేసుకుని పైకి ఎక్కారు. తన చేతిలో ఉన్న కండువ తో నేమ్ ప్లేట్ ను తుడుస్తున్న సమయంలో లింగాచారి చేయి పైన వైర్లకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో లింగాచారికి ఒళ్లంతా కాలిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు లైన్మెన్ లింగాచారిని ఖమ్మంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడికి చికిత్స అందించారు. అధికారుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అసలు తప్ప ఎవరిది..‌?

ఎన్పీడీసీఎల్ లో అధికారుల నిర్లక్ష్యంతో చిన్నచిన్న ఉద్యోగులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి సేఫ్టీ లేకుండా సబ్ స్టేషన్లలోకి వెళ్లటంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా తల్లాడ సబ్ స్టేషన్ లో ఇలానే జరిగిందని తెలుస్తోంది. ప్రొడక్షన్ ఏడీఈ తన కంట్రోల్లో ఉన్న సిబ్బందిని తీసుకొని వెళ్లకుండా తల్లాడ డివిజన్లో ఉన్న లైన్మెన్ ను బలి చేశారంటూ తోటి లైన్మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లాడ ఏడీఈ, ఏఈకు సమాచారం ఇవ్వాలి. అలా చేయకుండా అధికారులు చెప్పకుండా రావడం ఏందని ప్రశ్నిస్తున్నారు. సిటీ ట్రాన్స్​ఫార్మర్​ నేమ్ ప్లేట్ తనిఖీ చేసే సమయంలో సంబంధిత ఏడీఈ, ఏఈ కు ఎల్ సీ తీసుకోకుండా లోపలికి ఎలా వెళ్తారని లైన్మెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుకి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నిస్తున్నారు.

నేడు ఎన్పీడీసీఎల్ సీఎండీ జిల్లాలో తనిఖీలు..

మంగళవారం ఖమ్మం జిల్లాలో ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి వివిధ సబ్ స్టేషన్ లను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఇల్లందు సెక్షన్, అశ్వరావుపేట సెక్షన్, తల్లాడ సెక్షన్ తనిఖీలు చేసేందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. తల్లాడ సబ్ స్టేషన్ లో జరిగిన సంఘటనపై సీఎండీ విచారణ చేయనున్నట్లు సమాచారం.



Next Story