మున్సిపాలిటీలో నష్టానికి బాధ్యులు ఎవరు..?

by Hamsa |
మున్సిపాలిటీలో నష్టానికి బాధ్యులు ఎవరు..?
X

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీలో నెలకొన్న ప్రకంపనల నుంచి సేఫ్ గా బయటపడేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారా...? కొన్ని నెలలుగా జరిగిన అనేక సంఘటన నుంచి బయటపడేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తున్నారా....? పాత ఇనుము స్క్రాప్ స్వాహాతో సహా ఇతర అనేక తప్పిదాల నుంచి బయటపడేందుకు ఇక్కడ అధికారులు ప్రయత్నిస్తున్నారా...? అనే ప్రశ్నలు ప్రస్తుతం వైరాలో చర్చనీయాంశంగా మారాయి . వామ్మో వైరా మున్సిపాలిటీలో పని చేయలేమనే ఓ సాకుతో ఇక్కడ విధుల నుంచి బయటపడేందుకు కొంతమంది అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వైరా మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం చేకూర్చే విధంగా జరిగిన అనేక సంఘటనకు బాధ్యులు ఎవరనేది ఇంకా బహిర్గతం కావల్సి ఉంది. మున్సిపాలిటీలో నీతి నిజాయితీతో పని చేస్తున్నామని చెప్పుకునే అధికారులు ప్రస్తుతం వచ్చిన ఆరోపణల పై పూర్తి విచారణ జరిగిన తర్వాత తమ తప్పు లేదని నిరూపించుకొని రిలీవ్ అయితే కడిగిన ముత్యంలా బయటికి వెళ్ళవచ్చు. కాని అర్ధాంతరంగా వైరాను వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మరిన్ని అనుమానాలు బలపడే అవకాశం ఉంది.

వైరాలో మున్సిపాలిటీ తో పాటు అనేక శాఖల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఆ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వైరా పై లేని భయం కేవలం మున్సిపాలిటీ ఉద్యోగుల్లోనే ఎందుకు కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధన ప్రకారం అధికారులు పని చేస్తే వైరాలో పనిచేయలేమనే సాకులు ఎందుకు చెబుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరా మున్సిపాలిటీకు డిప్యూటేషన్ పై వచ్చి పనిచేస్తున్న కొంతమంది అధికారులు ప్రస్తుతం జరుగుతున్న తీవ్ర పరిణామాల నుంచి సులువుగా బయటపడేందుకు తమకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే వైరా మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం చేకూర్చే విధంగా జరిగిన అనేక సంఘటనకు బాధ్యులు ఎవరనేది ఇంకా బహిర్గతం కావల్సి ఉంది.

ఈ ప్రశ్నలకు జవాబు ఏది..

వైరా మున్సిపాలిటీలోని సోమవారం గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మంచినీటి ట్యాంకును కౌన్సిల్ తీర్మానం లేకుండా, ఇంజనీరింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండానే కూల్చివేశారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్ కు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈనెల 15వ తేదీన 90 రోజుల తర్వాత ఎట్టకేలకు ఇన్చార్జి కమిషనర్ బి. అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కమిషనర్ ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర విచారణ చేస్తున్నారు. మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ గోదాములను గతంలో కూల్చివేశారు. ఈ గోదాములు కూల్చి వేసిన స్థలంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ గోదాములకు సంబంధించిన ఇనుప స్క్రాప్ అప్పట్లో మున్సిపాలిటీ కార్యాలయంలో భద్రపరిచారు. అదేవిధంగా వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న పట్టు పరిశ్రమ కార్యాలయాన్ని కూల్చివేశారు.

ఈ కార్యాలయం సంబంధించిన స్క్రాప్ మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉన్నాయి. సోమవారం గ్రామపంచాయతీ ఉన్న సమయంలో 20కి పైగా స్వచ్ఛ రిక్షాలను కేటాయించారు. ప్రస్తుతం వైరా మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాలకు అప్పట్లో స్వచ్ఛ రిక్షాలను ప్రభుత్వం అందజేసింది. ఇవే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర ఇనుప స్క్రాప్ కూడా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ ఇనుప స్క్రాప్, స్వచ్ఛ రిక్షాలు మాయమయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఇనుప స్క్రాప్ కనిపించడం లేదు. సోమవారం గ్రామం వాటర్ ట్యాంక్ సంబంధించిన ఇనుప స్క్రాప్ కూడా మాయమైంది. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ వాహనాల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారనే ఆరోపణ వినవస్తున్నాయి. మున్సిపాలిటీలో ఇలాంటి ప్రతికూల వాతావరణం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది అధికారులు ఇక్కడ నుంచి రిలీవ్ కావాలని తీవ్రంగా ప్రయత్నించడంలో ఆంతర్యం ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనన్నిటికీ బాధ్యులు ఎవరో తెలియకుండానే కొంతమంది అధికారులు ఇక్కడ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయటం పలు అనుమానాలకు తావిస్తుంది.

వైరాను తప్పుగా చిత్రీకరించేందుకు అధికారులు యత్నం..

ఎంతో ఘన చరిత్ర ఉన్న వైరాను అధికార వర్గాల్లో తప్పుగా చిత్రీకరించేందుకు మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వామ్మో వైరాలో ఉద్యోగం చేయలేమంటూ కొంతమంది అధికారులు నిట్టూర్పు గా మాట్లాడుతున్నారు. వైరాలో మున్సిపాలిటీలతో పాటు అనేక శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులు మినహా ప్రభుత్వ కార్యాలయాల్లోని ఏ అధికారి కూడా వైరాకు అపవాదు, అపకీర్తిని అంట కట్టలేదు. కొంతమంది అధికారులు సుమారు 8 ఏళ్ల నుంచి లాంగ్ స్టాండింగ్ లో ఇక్కడ పనిచేస్తున్నారు. అలాంటి అధికారులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని వైరాలో కేవలం మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులకు ఇబ్బంది కలిగిందంటే ఆలోచించాల్సిన విషయం.

ఇప్పటికే మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులు వైరాలో తాము పని చేయలేమని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్నట్లు తెలిసింది. తమను వైరా నుంచి రిలీవ్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు కొంతమంది అధికారులు వైరా నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిని కూడా తాము రిలీవ్ అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటీలో నీతి నిజాయితీతో పని చేస్తున్నామని చెప్పుకునే అధికారులు ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు పై పూర్తి విచారణ జరిగిన తర్వాత తమ తప్పు లేదని నిరూపించుకొని రిలీవ్ అయితే కడిగిన ముత్యంలా బయటికి వెళ్ళవచ్చు. కానీ అర్ధాంతరంగా వైరాను వదిలి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మరిన్ని అనుమానాలు బలపడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కొంతమంది అధికారులు ఇక్కడ నుంచి బయటపడేందుకు ఇంకా ప్రయత్నిస్తారా...? తమ చిత్తశుద్ధిని చాటుకుని ఇక్కడ పని చేస్తారా వేచి చూడాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed