అంతా అక్రమ నిర్మాణాలే..!

by Sumithra |
అంతా అక్రమ నిర్మాణాలే..!
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా, మున్సిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా అంతా అక్రమ నిర్మాణాలే కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల్లో వైరా మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలుస్తుందనటంతో ఎలాంటి సందేహం లేదు. వైరాకు నడిబొడ్డున చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాల గురించి కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ వ్యాపార సముదాయాల కోసం చేపట్టటం విశేషం. తమ వ్యాపార కార్యకలాపాల కోసం మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో రేకుల షెడ్లను నిర్మించారు. అంతేకాకుండా కొంతమంది రెసిడెన్షియల్ అనుమతులు పొంది కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.

వైరాలోని జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నా మున్సిపాలిటీ అధికారులకు కనిపించకపోవడం విశేషం. ఇటీవల వైరా మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని, హనుమంతరావు దంపతులతో పాటు పలువురు వైరాలో అక్రమ నిర్మాణాల పై ఆందోళన చేసి అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినా ఇదంతా తమకు "మామూలే"నని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత బహిరంగంగా కనీస అనుమతులు లేకుండా చేపడుతున్న, చేపట్టిన నిర్మాణాల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించటంతో మున్సిపాలిటీ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

ఇవే అక్రమ నిర్మాణాలు... చర్యలకు సిద్ధమా..?

వైరాలోని జాతీయ ప్రధాని రహదారి పక్కన మొదలుకొని పలు వార్డుల్లో అనుమతులు లేకుండా యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గత సంవత్సర కాలం క్రితం వైరా బస్టాండ్ వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే గత రెండు రోజుల క్రితం అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనాన్ని తొలగించాలని 10వ వార్డ్ కౌన్సిలర్ కర్నాటి నందిని, హనుమంతరావు దంపతులతో పాటు కొంతమంది ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ కు లిఖిత పూర్వక పిర్యాదు చేశారు. అదేవిధంగా వైరాలోని పాత బస్టాండ్ సెంటర్లో వజ్రా టీవీఎస్ షోరూం ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో రేకుల షెడ్డు నిర్మించారు. అంతే కాకుండా వైరా నడిబొడ్డున మధిర క్రాస్ రోడ్డు సమీపంలో టీ టైమ్స్ టీ స్టాల్ ఏర్పాటు చేసేందుకు సుమారు 350 గజాలలో భారీ స్థాయి రేకుల షెడ్డు నిర్మించారు.

ఈ నిర్మాణానికి కనీస అనుమతులు తీసుకోలేదు. వైరాలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా ఓ భవనాన్ని కమర్షియల్ కేంద్రంగా మార్చడం విశేషం. సుమారు 100 గజాలలోపు ఉన్న ఈ స్థలంలో మూడంతస్తులు నిర్మించి షెట్టర్లు నిర్మించడం విశేషం. కనీసం ఈ భవనానికి పార్కింగ్ స్థలం కూడా లేనప్పటికీ అధికారులు ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అంతే కాకుండా ఇటీవల తల్లాడ రోడ్లో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన భారీ స్థాయి రేకుల షెడ్ లో వెంకటేశ్వర టైల్స్ మార్బుల్ అండ్ గ్రానైట్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ రేకుల షెడ్డు నిర్మాణం పై పలు ఫిర్యాదుల అందిన అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. అధికారులకు పలువురు ఫిర్యాదు చేసిన ఇదంతా తమకు మామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో వైరా మున్సిపాలిటీ నష్టపోతున్నా అధికారుల్లో కనీస చలనం లేదు.

అక్రమ నిర్మాణాలకు దర్జాగా ఇంటి నెంబర్ల కేటాయింపు..

వైరా మున్సిపాలిటీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు దర్జాగా ఇంటి నెంబర్లను కేటాయించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల గండగలపాడులో ఖాళీ స్థలానికి అధికారులు ఇంటి నెంబర్ కేటాయించారు. అయితే అధికారులు కేటాయించిన ఇంటి నెంబర్ ఆధారంగా ఇంటి నెంబర్ పొందిన వ్యక్తి తన స్థలంతో పాటు తన పక్కనే ఉన్న మరో 330 గజాల స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ విషయమై గండగలపాడు గ్రామంలో పంచాయతీలు జరిగాయి.

అదేవిధంగా వైరా మున్సిపాలిటీలోని అక్రమంగా చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ టాక్స్ పేరుతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికే వైరా మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా ఇంటి నెంబర్లు కేటాయించటం వివాదాస్పదమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరా మున్సిపాలిటీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story