తెల్లవార్లు బార్లా..!

by Sumithra |
తెల్లవార్లు బార్లా..!
X

ఖమ్మం నగరంలోని కొన్ని బార్ల యజమానులు అడ్డగోలుగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అమ్మకాలు జరుపుతూ.. అడ్డగోలుగా డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం పాటించకుండా తెల్లవారు జాము నుంచే షాపులను బార్లా తెరుస్తున్నారు. అదేంటని ప్రశ్నించిన వారిని మాకు పర్మిషన్లు ఉన్నాయని, కొంత మంది అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ చెప్పడం గమనార్హం. సమయా భావం లేకుండా షాప్ నడుపుతున్నా.. ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు ప్రవర్తించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉండటంతోనే వారు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో బార్ల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

దిశ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి జిల్లాలోని కొంత మంది మద్యం వ్యాపారులు నిబంధనలు పాటించకుండా అమ్మకాలు జరుపుతున్నారు. అడ్డగోలుగా డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ వైపు గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలుస్తుండటంతో పాటు తెల్లవారుజామునుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. మరోవైపు కొంతమంది బార్ల యజమానులు సైతం టైం పాటించకుండా తెల్లవారు జాము నుంచే షాపులను బార్లా తెరుస్తూ నిబంధనలు పక్కన బెట్టి వ్యాపారం చేస్తునారు. అదేంటని ప్రశ్నించిన వారిని మాకు పర్మిషన్లు ఉన్నాయని, కొంత మంది అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ చెప్పడం గమనార్హం.

ఖమ్మం నగరంలోని కొన్ని బార్ల యజమానులు అడ్డగోలుగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం పాటించకుండా ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతున్నారు. నిబంధనలు విరుద్ధంగా బార్లు నడిపిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్లోని తరుణి బార్ అండ్ రెస్టారెంట్ ప్రభుత్వ నిబంధనలు పక్కన బెట్టి ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

ఎప్పుడైనా ఓపెన్..

నగరంలోని తరుణి బార్ అండ్ రెస్టారెంట్ 24 గంటలు బార్ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 4.30 గంటల సమయంలో కూడా బార్ షాపునకు సంబంధించిన తలుపులు బార్లా తెరవడమే కాకుండా ఎలాంటి జంకు లేకుండా కస్టమర్లకు తెల్లవారుజాము నుంచే సిట్టింగ్ ఏర్పాట్లు చేసి మరీ మందు విక్రయాలు జరపుతుండటం గమనార్హం. కాగా తెల్లవారు జాము నుంచే మందు విక్రయాలు జరపడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాకు ఏమీ కాదు..

తరుణి బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలు పాటించకుండా బార్ నడపడం పట్ల పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇదే విషయం బార్ యజమానిని ప్రశ్నించగా మాకు స్పెషల్ పర్మిషన్ ఉందంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. మేం ఎక్సైజ్ వాళ్లకు మామూళ్లు ఇస్తున్నాము.. మా వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మాకు ఏం ఇబ్బంది కాదంటూ చెప్పుకు రావడం గమనార్హం. సమయాభావం లేకుండా షాప్ నడపడం పట్ల ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు ప్రవర్తించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉండడం వల్లే వారు పట్టించుకోవడం లేదని విమర్శలు సైతం వస్తున్నాయి.

అందరికీ ఒకే నిబంధనలు..

కాగా, ఎక్సైజ్ అధికారుల వద్దకు తరుణి బార్ అండ్ రెస్టారెంట్ వ్యవహారం తీసుకెళ్లగా ఎవరికీ ఎలాంటి స్పెషల్ పర్మిషన్లే లేవని.. అందరూ నిబంధనల ప్రకారమే షాపులు నడపాలనే చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు షాపులు నడిపినా చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు. మరి తరుణి బార్ అండ్ రెస్టారెంట్ ఇంత బాహాటంగా తెల్లవారుజామునుంచే మందు విక్రయాలు జరపడం పట్ల ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Next Story

Most Viewed