లక్ష్య సాధనకు విద్యార్థులు కృషి చేయాలి

by Sridhar Babu |
లక్ష్య సాధనకు విద్యార్థులు కృషి చేయాలి
X

దిశ, ఖమ్మం రూరల్ : జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆరవ తరగతి క్లాస్ రూంలోకి వెళ్లి ఉపాధ్యాయురాలు గణితం బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం బోర్డుపై గణిత పాఠాన్ని పిల్లలకు సులువుగా అర్ధమయ్యేలా బోధించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో బోధన విధానంను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు తాము నిర్దేశించుకున్న గమ్యాలను ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒకసారి డైరీలో రాసుకోవాలని అన్నారు.

లక్ష్యాలను చేరుకునేందుకు మనల్ని మనం సన్నద్దం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కొంత నిర్దిష్ట సమయాన్ని ఇంటి వద్ద చదువు కోసం, ఆటలు ఆడేందుకు కేటాయించి దాని ప్రకారం నడుచుకోవాలని కోరారు. పౌష్టికాహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్ తినే అలవాట్లు తగ్గించుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఎనిమిది లక్షల రూపాయలతో చేపట్టిన టాయిలెట్ మరమ్మతు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్ మొదలైన పనులను కలెక్టర్ పరిశీలించారు.

తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎలక్ట్రికల్ పనులు, 2 ఫేజ్ ను 3 ఫేజ్ విద్యుత్ గా మార్చే పనులు వెంటనే చేపట్టేందుకు కలెక్టర్ 50 వేల రూపాయల చెక్కును ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిల వివరాలు సమర్పించాలన్నారు. పాఠశాలలో అవసరమైన ఫర్నిచర్, ఇతర వసతుల ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యాంసన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story